calender_icon.png 28 November, 2024 | 2:18 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బియ్యం బుక్కేశారు

27-09-2024 02:07:17 AM

200 కోట్ల మేర అవకతవకలు!

  1. రెండు మిల్లుల లెక్కల్లో తేడాలు 
  2. టాస్క్‌ఫోర్స్ దాడులతో వెలుగులోకి నిజాలు 

ఖమ్మం, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)కు సంబంధించి కోట్లల్లో చేతులు మారినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత రెండు రోజులుగా జిల్లాలోని రైస్ మిల్లుల్లో హైదరాబాద్ జిల్లాకు చెందిన పౌరసరఫరాల శాఖాధికారులతో కలిసి టాస్క్‌ఫోర్స్ అధికారులు చేసిన తనిఖీల్లో సీఎంఆర్‌కు సంబంధించిన అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. జిల్లాలో సీఎంఆర్ తీసుకున్న అన్ని రైస్ మిల్లులు 50 శాతం కూడా తిరిగి అప్పగించలేదని తెలుస్తున్నది. ఇందుకు సంబంధించి దాదాపు రూ.200 కోట్లకు పైగానే  అవకతవకలు జరిగాయనే ఆరోపణలు వస్తున్నాయి. 

ఒక్క మిల్లులోనే 100కోట్ల వ్యత్యాసం

బుధవారం సాయంత్రం కొణిజర్ల మండలం పల్లిపాడు వద్ద ఉన్న ఎస్‌ఏఆర్ రైస్ మిల్లును అధికారులు సోదా చేయగా సీఎంఆర్ లెక్కల్లో భారీ వ్యత్యాసం కనిపించినట్లు తెలిసింది. ఈ మిల్లుకు 3,50,622 క్వింటాళ్ల ధాన్యాన్ని సీఎంఆర్ కోసం కేటాయించగా కేవలం 99,012 క్వింటాళ్ల బియ్యం మాత్రమే తిరిగి అప్పగించారు. అంటే 2,51,499 క్వింటాళ్లకు సంబంధించి లెక్కలు మాయమయ్యాయి. ఈ ఒక్క రైస్ మిల్లులోనే దాదాపు రూ.100 కోట్ల మేర   సీఎంఆర్‌లో అవకతవకలు చోటు చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంలోని రైస్‌మిల్లులో సీఎంఆర్ లెక్కల్లో వ్యత్యాసం వచ్చినట్టు సమాచారం. 

రూ. కోట్లలో ముడుపులు

మిల్లుల యాజమాన్యాలు జిల్లా పౌరసరఫరాశాఖలోని కొంతమందికి రూ.కోట్లలో ముడుపులు ముట్టజెప్పినట్టు ఆరోపణలు ఉన్నాయి. అందువల్లే సీఎంఆర్ ఇవ్వకపోయినా అధికారులు పట్టించుకోలేదని తెలు స్తున్నది. మరో 10 మిల్లుల్లో అవకతవకలు జరిగినట్టు సమాచారం. పూర్తిస్థాయిలో విచారణ జరిగితేనే వాస్తవాలు  వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. 

మిల్లు రిపేరు పేరుతో తరలింపు 

వనపర్తి, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధ్యానాన్ని మర ఆడించి ఎఫ్‌సీఐ, సీఎంఆ ర్‌కు పెట్టకుండా పక్క రాష్ట్రానికి తరలిస్తుం డగా రైతులు అడ్డుకున్నారు. గురువారం వనపర్తి జిల్లా పెబ్బేర్ సమీపంలోని ఓ రైస్‌మిల్లర్ ధ్యానాన్ని రాయిచూర్‌కు తరలిం చేందుకు యత్నించాడు. గమనించిన రైతులు లారీని అడ్డుకుని ప్రశ్నించారు. దీంతో రైస్‌మిల్లర్ అక్కడికి చేరుకుని గోదాంకు తరలిస్తున్నట్టు చెప్పి పెబ్బేర్ మార్కెట్ యార్డు గోదాంకు తరలించాడు. సివిల్ సప్లు అధికారికి తెలియడంతో డీటీలను అక్కడికి పంపిచారు. వారు చేరుకు నే సమయానికి ధ్యానం లారీ గోదాంలో ఉన్నది. కాగా సదరు యజమాని గురువా రం సాయంత్రం కలెక్టరేట్‌లోని సివిల్ సప్లు కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం అనుమానాలకు తావిస్తున్నది. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకే సివిల్ సప్లు కార్యాలయాని వెళ్లినట్టు చెప్పారు.