10-04-2025 07:17:55 PM
రేషన్ దుకాణాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ..
కాటారం (విజయక్రాంతి): అర్హులైన లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని అందించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పేర్కొన్నారు. గురువారం కాటారం మండలం కొత్తపల్లి చౌకధరల దుకాణాన్ని కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మిక తనిఖీ చేసి లబ్ధిదారులతో ముఖాముఖీ మాట్లాడారు. ఈ సందర్భంగా సన్న బియ్యం తీసుకుంటున్న తోడె మాధవరెడ్డి, అసంపల్లి దుర్గమ్మ లబ్ధిదారులను ఎన్ని కేజీలు సన్నబియ్యం ఇస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. తోడె మాధవరెడ్డి నలుగురు కుటుంబ సభ్యులం ఉన్నామని అందువల్ల తనకు 24 కేజీలు ఇచ్చారని, అసంపల్లి దుర్గమ్మ ఇద్దరు ఉన్నందున తనకు 12 కేజీలు ఇచ్చారని తెలిపారు.
ఒక్కొక్కరికి 6 కేజీలు చొప్పున ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుందని తెలిపారు. జిల్లాలో అన్ని చౌక దుకాణాలకు సన్నబియ్యం స్టాకు చేరిందని లబ్ధిదారులు సన్నబియ్యం తీసుకోవాలని సూచించారు. ఈ రేషన్ దుకాణంలో దాదాపు 90 శాతం బియ్యం పంపిణీ జరిగిందని, జిల్లా వ్యాప్తంగా 77 శాతం పంపిణీ జరిగినట్లు ఆయన తెలిపారు. తెల్ల రేషన్ కార్డు దారులు ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న సన్నబియ్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్షేత్రస్థాయిలో సన్నబియ్యం పంపిణీపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం ద్వారా బియ్యం పంపిణీ వ్యవస్థ పకడ్బందీగా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సన్నబియ్యం అందాలని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా బయో మెట్రిక్ ద్వారా బియ్యం సరఫరా వివరాలు నమోదు పరికరాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాధ్, డిటి రామ్మోహన్, రేషన్ దుకాణ డీలరు బారిపాషా తదితరులు పాల్గొన్నారు.