calender_icon.png 19 April, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారదర్శకంగా సన్నబియ్యాన్ని పంపిణీ చేయాలి

03-04-2025 12:00:00 AM

నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి

నాగార్జున సాగర్, మార్చి 2  :  రేషన్కార్డుదారులకు పారదర్శకంగా సన్నబియ్యం పంపిణీ చేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. తిరుమలగిరి (సాగర్)లో ఎమ్మెల్యే కుందూరు జైవీర్రెడ్డితో కలిసి లబ్ధిదారులకు ఆమె బియ్యం పంపిణీ చేసి మాట్లాడారు. రేషన్డీలర్లు తుకాలు పక్కాగా ఉండేలా చూసుకోవాలని సూచించారు. మండలంలో రేషన్ డీలర్ల ఖాళీలను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేయాలని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ను ఆదేశించారు.

రేషన్కార్డుల జారీ, మార్పులు చేర్పుల ప్రక్రియ నిరంతరంగా సాగుతుందని తెలిపారు. చనిపోయిన వారి  పేర్లను కార్డుల నుంచి తొలగిస్తామని ఇందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి క్వింటాకు రూ.2320  మద్ధతు ధర చెల్లిస్తూ రూ.500 బోనస్ సైతం ఇస్తున్నదని గుర్తు చేశారు. రైతులు సన్నధాన్యం పండించాలని కోరారు.

దర్తి ఆబా యోజన పథకం ద్వారా గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. అంతకుముందు కలెక్టర్, ఎమ్మెల్యే భూమి రెగ్యులరైజేషన్ పైలట్ ప్రాజెక్ట్, ప్రభుత్వ సంస్థలకు భూమి కేటాయింపు, అభివృద్ధి పనులు, తదితర అంశాలపై సమీక్షించారు. పైలెట్ ప్రాజెక్టు కింద అర్హులకు పట్టాల పంపిణీ వేగవంతం చేయాలని ఎమ్మెల్యే కోరారు.