21-03-2025 12:00:00 AM
ఎండుతున్న పంటలు
పశువులకు మేతగా మారిన వైనం
బోర్లలో ఇంకిపోతున్న నీరు
ఆందోళనలో రైతన్నలు
వెల్దుర్తి, మార్చి 20 : కళ్ళముందే వరిపంట ఎండుతోంది... నేలంతా నెర్రలు వారుతోంది...వేసిన పంట ఎండిపోగా... పశువుల మేతకు బలవుతోంది.. ఇక మాకు దిక్కేవరు అంటూ అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు..ఓవైపు భానుడి ప్రతాపం.. మరోవైపు ఎండుతున్న బోర్లతో రైతన్న లబోదిబోమంటున్నాడు... మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో చాలా గ్రామాల్లో ఇదే దుస్థితి నెలకొంది.
ఆరుగాలం కష్టపడి పండించిన పంట చూస్తుండగానే ఎండుముఖం పడుతుంటే రైతు గుండె చెరువవుతోంది. వెల్దుర్తి మండలంలో ఎక్కువ గ్రామాలు వర్షాధార పంటలను బోరుబావుల ద్వారానే పండిస్తారు. గత వానాకాలంలో కురిసిన భారీ వర్షాలకు సంతోషం వ్యక్తం చేసిన రైతులు ఈసారి సుమారుగా 16,550 ఎకరాల్లో వరి పంట వేశారు. వీటిలో చాలా వరకు బోరు బావుల కింద వేసినవే.
తీరా పంట చేతికొచ్చే సమయానికి ముందస్తు ఎండల ప్రభావంతో చెరువుల్లో నీరు అడుగంటి పోవడమే కాకుండా బోరు బావుల్లో నీరు పోయడం లేదు. దీంతో రైతులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. పంట చేతికొచ్చే సమయంలో నేల తడార్చలేని దుస్థితి ఏర్పడుతోంది. భూగర్భ జలాలు రోజురోజుకు తగ్గుముఖం పడుతుండడంతో కండ్ల ముందే పంటంతా ఎండిపోతుంది.
మండలంలోని యశ్వంతరావుపేట్, పక్కనే ఉన్న లంబాడి తండా, మంగళపర్తి, చర్ల పల్లి తాండాలో వరిపంట దాదాపుగా ఎండిపోవడానికి సిద్ధంగా ఉంది. కనీసం పంట పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితులు లేవని రైతులు వాపోతున్నారు. ఇంకా పది రోజులు ఇలాగే కొనసాగితే రైతులకు మిగిలేది శూన్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోసం తెచ్చిన పెట్టుబడి తడిసిమోపడయ్యే పరిస్థితి ఏర్పడుతుందని, తమను ప్రభుత్వమే కాపాడాలని రైతులు కన్నీరు పెడుతున్నారు.
ఒక్కసారిగా పడిపోతున్న భూగర్జ జలాలు...
గత వానాకాలంలో విస్తృతంగా వర్షాలు కురిశాయని ఆశపడ్డ రైతులకు ఈసారి తీవ్రమవుతున్న ఎండల వల్ల నిరాశే మిగులు తుంది. మండలంలో చెరువుల్లో పుష్కలంగా నీరు నిండిందని, బోరుబావుల్లో సమృద్ధిగా నీరుందని భావించిన రైతులు సన్న, దొడ్డురకం వరి పంటను వేశారు.
తీరా పంట చేతికొచ్చే సమయానికి ఎండలు ముదురుతుండడంతో చెరువుల్లో కాలువల్లో నీటి మట్టం తగ్గిపోవడమే కాకుండా బోర్లలో నీరు అడుగంటి నీరు పోయడం లేదని వాపోతున్నారు. ఓవైపు చీడపురుగులు, మరోవైపు కల్తీ ఎరువుల వల్ల నష్టపోతున్న రైతులకు ప్రకృతి కూడా కన్నెర్ర చేస్తుందని లబోదిబోమంటున్నారు.
అయితే మండలంలో భూగర్భ జిలాలు రోజురోజుకు తగ్గుముఖం పడుతుంటే ఎండుతున్న పంటల వైపు చూస్తూ రైతులు కన్నీరు కారుస్తున్నారు. పంటలు ఎండుతున్నా అధికారులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ కన్నెత్తి చూడడం లేదని విమర్శిస్తున్నారు.