25-03-2025 12:34:55 AM
హైదరాబాద్, మార్చి 24 (విజయక్రాంతి): ఈనెల 21 నుంచి 23 వరకు కురిసిన వడగళ్ల వానల వల్ల జరిగిన పంటనష్టంపై ప్రాథమిక నివేదిక అందిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా రైతువారీ సర్వే చేసి తుది నివేదిక రూపొందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
దాదాపు 13 జిల్లాల్లోని 64 మండలాల్లో 11,298 ఎకరాల్లో నష్టం జరిగినట్లు అంచనా వేసినట్లు తెలిపారు. దెబ్బతిన్న పంటల్లో 6,670 ఎకరాల్లో వరి, 4,100 ఎకరాల్లో మొక్కజొన్న, 309 ఎకరాల్లో మామిడి, మిగిలినవి ఇతర పంటలు ఉన్నాయని వెల్లడించారు. పంటనష్టంపై పూర్తి నివేదిక అందగానే నష్టపరిహారం చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.