ఒడిశాలో ప్రధానికి ధన్యవాదాలు తెలుపుతూ నగదు అందించిన గిరిజన మహిళ
న్యూఢిల్లీ, అక్టోబర్ 20: ఒడిశాలోని సుందగఢ్‌లో ఓ గిరిజన మహిళ ప్రధాని మోదీపై తన అభిమానాన్ని చాటుకుంది. జిల్లాలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుండగా ఓ గిరిజన మహిళ రూ.100 తీసుకొని వచ్చి ప్రధానికి ఇవ్వాలంటూ బీజేపీ ఉపాధ్యక్షుడు బైజయ ంత్ పాండాకి అందజేసింది.
ప్రధానికి నా ధన్యవాదాలు తెలియజేయండి’ అని ఆమె కోరారు. నగదు వద్దని బైజయంత్ చెప్పినప్పటికీ ఆ మహిళ విన లేదు. పట్టుబట్టి మరీ డబ్బు ఇచ్చి వెళ్లింది. ఇందుకు సంబంధించిన వివరాలు, గిరిజన మహిళ ఫొటోను ఆయన ఎక్స్‌లో షేర్ చేయగా.. అది ప్రధాని మోదీ దృష్టికి వచ్చింది.
దీనిపై మోదీ ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ‘ఆ గిరిజన మహిళ ఆప్యాయత నన్ను కదిలిస్తోంది. వికసిత్ భారత్ దిశగా నేను చేస్తున్న కృషికి నారీ శక్తి ఆశీస్సులు అందించడం నన్ను మరింత ప్రోత్సహిస్తున్నాయి’ అని మోదీ అన్నారు. కాగా ఈ ఏడాది ఒడిశాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ పార్టీ ఘోర ఓటమిని చవిచూసింది.