22-01-2025 12:50:41 AM
సంఘం పూర్వ విద్యార్థి, ప్రొఫెసర్ హరగోపాల్
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 21(విజయక్రాంతి): యాభై ఏండ్ల క్రితం ఆవిర్భవించిన విప్లవ విద్యార్థి సంఘాలు సమాజాన్ని చైతన్యం చేశాయని ప్రొఫెసర్ హరగోపాల్ సహా పలువురు వక్తలు అన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో విప్లవ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షడు సాంబమూర్తి అధ్యక్షతన నిర్వహించిన విలేకరుల సమావేశంలో విప్లవ విద్యార్థి సంఘం పూర్వ విద్యార్థులు ప్రొ.హరగోపాల్, డా.శ్రీనివాస్, రాజేంద్రబాబు, సుధ, అనల, సజయ, విరాహత్ తదితరులు పాల్గొని మాట్లాడారు.
ఫిబ్రవరి 20, 21 తేదీల్లో విప్లవ విద్యార్థి సంఘం 50 వసంతోత్సవాల సభలను బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించబోతున్నట్లు తెలిపారు. నాటి తరం అనుభవాలు, పోరాటాల స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేస్తామని చెప్పారు. 1974లో ఏర్పడిన విప్లవ విద్యార్థి సంఘాలు.. విద్యార్థుల సమస్యలతో పాటు సమాజంలోని అసమానత్వం, అన్యాయంపై పోరాడాయని, తర్వాత నిషేధానికి గురయ్యాయని చెప్పారు. సమావేశంలో విప్లవ విద్యార్థి సంఘాల మాజీ నాయకులు పాల్గొన్నారు.