- ప్రభుత్వ, ప్రజల సహకారంతో ఏడేండ్లు పూర్తి
- రెండో దశ పనులకు నిధుల కొరత లేదు
- ఎల్‌అండ్‌టీ లాభనష్టాలను ఆలోచించదు
- హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ కేవీబీ రెడ్డి
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 28 (విజయక్రాంతి): మెట్రో ట్రైన్ సర్వీసులు అందుబాటులో వచ్చాక హైదరాబాద్‌లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఎంఆర్ ఎల్), హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ (ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్) ఎండీ కేవీబీ రెడ్డి అన్నారు.
హైదరాబాద్‌లో మెట్రో రైల్ సర్వీసులు ఏడేండ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా గురువారం అమీర్‌పేట్ మెట్రో స్టేషన్‌లో వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎంఆర్‌ఎల్ ఎండీ ఎన్వీఎస్‌రెడి, ఎల్‌అండ్‌టీఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ కేవీబీరెడ్డిని అధికారులు సన్మానించారు. అనంతరం వారు ఏడేండ్ల వార్షికోత్సవం డిజటల్ లోగోను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా క్వాలిటీ రేటింగ్ సంస్థ ద్వారా మెట్రోకు వచ్చిన ఫైవ్‌స్టార్ క్వాలిటీ సర్టిఫికేషన్‌ను వారు అందుకున్నారు. ఎన్వీఎస్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజల సహకారం తో ఏడేండ్లు పూర్తిచేసుకున్నామన్నారు. మెట్రో రాకతో నగరంలో పర్యావరణ కాలుష్యం తగ్గిందన్నారు.
ఢిల్లీ, బెంగళూరు లాంటి కాలుష్య పరిస్థితులు మన హైదరాబాద్‌లో రాకుండా ఉండాలంటే మెట్రోనే పరిష్కారమని చెప్పారు. మెట్రో రోండో దశకు నిర్మాణానికి.. జైకా, ఏడీబీ, ఎన్‌డీబీ లాంటి సంస్థ లు 2శాతం వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చాయ ని తెలిపారు. ప్రస్తుతం ఉన్న అన్ని కారిడార్లకు ఎయిర్‌పోర్ట్ మెట్రో కు కనెక్టివిటీ ఇస్తామని చెప్పారు. మెట్రో రెండోదశ ప్రాథమిక పనులు ప్రారంభిస్తామని తెలిపారు.
ఏడు వసంతాల్లో మెట్రో చేరిన మైలురాళ్లు..
ఇప్పటి వరకు మెట్రోలో 63.50లక్షల మంది ప్రయాణించినట్లు కేవీబీ రెడ్డి తెలిపారు. రోజువారీగా సగటు 4.75లక్షలుగా ఉంటోందని చెప్పారు. సగటున ఒక ప్రయాణికుడు 12.5 కిలోమీటర్లు ప్రయాణించార న్నారు. మెట్రోరైళ్లు ప్రతిరోజు 25,600 కిలోమీటర్లు ప్రయాణస్తున్నాయని ఇప్పటివరకు మొత్తం 44.2 మిలియన్ కిలోమీటర్లు దూరం ప్రయాణించాయన్నారు.
99.8 శాతం సమయపాలన ఉంటుందని, హాం కాంగ్, సింగపూర్, తర్వాత 99.9శాతం విశ్వసనీయత కలిగిన ప్రపంచంలోనే అత్యుత్తమ మెట్రో హైదరాబాద్ మెట్రో అని చెప్పారు. మెట్రో ద్వారా దాదాపు 184మిలియన్ లీటర్ల ఇందనం ఆదా అయిందని, 424 మిలియన్ కిలోల కర్బన ఉద్గారాలు తగ్గాయని తెలిపారు. సౌరవిద్యుత్ ద్వారా మెట్రో కు 12శాతం విద్యుత్ అవసరం తీరుతోందన్నారు.
ఇప్పటివరకు 56,935 మెగా వాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తయ్యిందన్నారు. రీజనరేటివ్ బ్రేకింగ్ టెక్నాలజీ ద్వారా 220 విలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకున్నామని పేర్కొన్నారు. వినియోగదారుల కోసం గురువారం నుంచి గ్రీన్‌మైల్స్ లాయల్టీ క్లబ్ ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
2025 ఉగాది సందర్భంగా ఎక్కువ ట్రిప్పులు ప్రయాణించిన వారికి బహుమతులు అందజేస్తామని చెప్పారు. మెట్రో స్టేషన్లు, డిపోల్లో గల 150కిపైగా రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ద్వారా 3.75లక్షల కిలో లీటర్ల నీటిని ఆదా చేశామన్నారు.
కొత్త రైళ్లను తీసుకోచ్చేందుకు మరో ఏడాది..
ఎల్‌అండ్‌టీ సంస్థ ఒకసారి ఏదైనా ప్రాజెక్టును చేపట్టిందంటే అం దులోని లాభనష్టాలను ఆలోచించదని ఎల్‌అండ్‌టీ ఎంఆర్‌హెచ్‌ఎల్ ఎండీ కేవీబీరెడ్డి అన్నారు. ఏడేండ్లలో హైదరాబాద్ మెట్రో ఎన్నో మైలురాళ్లను చేరు కుందని తెలిపారు. హైదరాబాద్ నగరంలోని 57 మెట్రో స్టేషన్లకు ఐజీబీసీ ప్లాటినం సర్టిఫికేషన్ పొందినదేశంలోనే తొలి మెట్రో అని పేర్కొన్నారు.
ఏడేండ్లలో ఎల్‌అండ్‌టీ రూ.6వేల కోట్ల నష్టాల్లో ఉందని మరో రెండు మూడేండ్లలో ఆ నష్టాలను పూడ్చుకునేలా కృషి చేస్తోందని వెల్లడించారు. మెట్రోల్లో బోగీలను పెంచేందు కు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. మరో 12 కొత్త రైళ్లను తీసుకొస్తామన్నారు.