calender_icon.png 22 April, 2025 | 5:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెన్నమనేని పౌరసత్వం రద్దు సరైనదే

22-04-2025 12:00:00 AM

  1. తీర్పు వెల్లడించిన హైకోర్టు 
  2. చెన్నమనేనికి రూ.30 లక్షల జరిమాన 
  3. విప్ ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు చెల్లింపు

హైదరాబాద్/కరీంనగర్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): వేములవాడ మాజీ ఎమ్మెల్యే రమేశ్‌బాబు పౌరసత్వాన్ని కేంద్రం రద్దు చేయడం సరైనదేనని హైకోర్టు స్పష్టం చేసింది. తప్పుడు పత్రాలతో అధికారులు, న్యాయస్థానాలను 15 ఏళ్ల పాటు తప్పుదోవ పట్టించారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. అందుకు పరిహారంగా రూ.30 లక్షలు చెల్లించాలని ఆదేశిస్తూ సోమవారం తుది తీర్పు ఇచ్చింది.

చెన్నమనేని పౌరసత్వంపై సోమవారం తుది విచారణ జరిపిన కోర్టు తీర్పును వెల్లడించింది. ఈ మేరకు చెన్నమనేని భారత పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. రూ.30 లక్షల జరిమానా చెల్లించాలని ఆదేశించింది.

రూ.30 లక్షల్లో పిటిషనర్ ఆది శ్రీనివాస్‌కు రూ.25 లక్షలు, హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీకి రూ.5 లక్షలు చెల్లించాలని పేర్కొన్నది. కోర్టు తీర్పుపైన అప్పీల్ చేయకుండా తప్పు ఒప్పుకుని రమేశ్‌బాబు రూ.30 లక్షలు రమేశ్‌బాబు చెల్లించారు. రూ.25 లక్షలు ఆది శ్రీనివాస్‌కు డీడీ రూపంలో చెన్నమనేని రమేశ్ తరఫు లాయర్ చెల్లించారు. 

చెన్నమనేనిని మాజీ ఎమ్మెల్యేగా పిలవొద్దు: ఆది శ్రీనివాస్

చెన్నమనేని రమేశ్ భారత పౌరుడు కాదని సుదీర్ఘ పోరాటం చేశానని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. దేశ పౌరుడు కాకుండా చట్టసభల్లో సభ్యుడు కావడం ప్రపంచంలో ఇదే మొదటిసారి కావొచ్చని ఆది శ్రీనివాస్ అన్నారు. ఆయన జర్మనీ పాస్‌పోర్టు మీద ప్రయాణం చేస్తూ తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆరోపించారు.

చెన్నమనేని ఎన్నికల్లో పోటీ చేయకపోతే పదేళ్ల క్రితమే తాను ఎమ్మెల్యేగా గెలిచేవాడినన్నారు. 2009 నుంచి ఆయన ఎమ్మెల్యే కారని, మాజీ ఎమ్మెల్యేగా కూడా పిలువకూడదంటూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేయాలని కోరారు. ఎమ్మెల్యేగా తీసుకున్న జీతభత్యాలను రికవరీ చేయాలని కోర్టును కోరుతానన్నారు.