వడ్ల కొనుగోలు కేంద్రంలోని సమస్యలపై అధికారులతో సమీక్ష
వర్షాలతో నష్టం వాటిల్లకముందే చర్యలు తీసుకోవాలని సుదర్శన్ రెడ్డి డిమాండ్
ఘట్ కేసర్, జూన్ 9 (విజయక్రాంతి) : ఘట్కేసర్ సర్కిల్, ఎదులాబాద్ లోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇంచార్జ్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని సంబంధిత సివిల్ సప్లైస్, వ్యవసాయ శాఖ అధికారులతో చర్చించారు.
రైతులు పండించిన ధా న్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చి బస్తాల్లో నింపి సిద్ధంగా ఉంచినప్పటికీ, సరై న రవాణా సౌకర్యం లేక గత పది రోజులుగా అక్కడే నిల్వ ఉండిపోతున్న పరిస్థితిని అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రస్తుతం వ ర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వర్షం కురిస్తే ధాన్యం తడిసి రైతులకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. రైతులు ఏడాది పొడవునా కష్టపడి పండించిన పంటను సకాలంలో కొనుగోలు చేసి గోదాములకు తరలించడం ప్రభుత్వ బాధ్యత అని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.
రవాణా సమస్యలను వెంటనే పరిష్కరించి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను కోరారు. ఈ విషయంపై స్పందించిన సివిల్ సప్లైస్, వ్యవసాయ శాఖ అధికారులు, రైతుల సమస్యలను అర్థం చేసుకున్నామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న రవాణా సమస్యలను అధిగమించి వచ్చే రెండు మూడు రోజుల్లో కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని పూర్తిస్థాయిలో తరలించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ మాయ నరేష్, బూత్ అధ్యక్షులు ఎర్రోళ్ల మురళి, స్థానిక రైతులు, బీజేపీ నాయకులు, సివిల్ సప్లైస్, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






