calender_icon.png 24 October, 2024 | 12:53 PM

Breaking News

3 నెలలకోసారి వర్సిటీలపై సమీక్ష!

24-10-2024 02:59:04 AM

  1. పనితీరుపై సమీక్షించుకోవాలని వీసీలకు గవర్నర్ సూచన
  2. కొత్త కోర్సులు, పరిశోధనలపై దృష్టిపెట్టాలని ఆదేశాలు
  3. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన కొత్త వీసీలు

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): ఇటీవల కొత్తగా నియామకమైన యూనివర్సిటీల వైస్ చాన్స్‌లర్లు, ఉన్నత విద్యామండలి చైర్మన్, వైస్ చైర్మన్లు బుధవారం గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను రాజ్‌భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఉన్నత విద్య, యూనివర్సిటీల్లోని పలు అంశాలు చర్చకు వచ్చినట్లు అధికారికవర్గాల ద్వారా తెలిసింది.

ఈ సందర్భంగా గవర్నర్ వీసీలకు పలు సూచనలు చేసినట్లు సమాచారం. యూనివర్సిటీల పనితీరుపై ఇక నుంచి మూడు నెలలు లేదా ఆరు నెలలకోసారి సమీక్ష జరుపుకోవాలని సూచించి నట్లు తెలిసింది. రెగ్యులర్ కోర్సులే కాకుండా ఉపాధి, ఉద్యోగావకాశాలకు సంబంధించిన కోర్సులను ప్రవేశపెట్టాలని ఆదేశించారు.

యూనివర్సిటీలు పరిశోధనలపై అధికంగా దృష్టి సారించాలని, ప్రాక్టికల్ కోర్సులను అందించడం ద్వారా విద్యార్థులు రాణిస్తారని వీసీలకు సూచించినట్లు తెలిసింది. కాగా రాష్ట్రంలోని యూనివర్సిటీల ప్రస్తుత పరిస్థితి గురించి ఓ ఉన్నతాధికారి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.

వర్సిటీల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, యూనివర్సిటీల్లో 50 శాతం కూడా పర్మినెంట్ ఉద్యోగులు లేరని, సరిపడా నిధులు కూడా లేవని ఓ అధికారి గవర్నర్‌కు వివరించినట్లు తెలిసింది. వర్సిటీల అభివృద్ధికి అత్యవసరంగా నిధులు కేటాయించాల్సి ఉందని తెలిపారు.

అయితే నిధుల విషయాన్ని తాను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని అధికారులకు గవర్నర్ చెప్పినట్లు తెలిసింది. త్వరలో మరోసారి సమావేశమవుదామని వీసీలతో ఆయన చెప్పినట్లు సమాచారం. సమావేశంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్లు ఐ పురుషోత్తం, మహమూద్, కార్యదర్శి శ్రీరాం వెంకటేశ్, యూనివర్సిటీల వీసీలు పాల్గొన్నారు.

వర్సిటీలకు వీసీలే కెప్టెన్

వర్సిటీ వీసీలు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అని గవర్నర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉన్నత విద్య భవిషత్తును రూపొందించడంలో వర్సిటీలు కీలక పాత్ర పోషించిలాని సూచించారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన వీసీలకు ఆయన ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.