హైదరాబాదు, జూన్ 29 (విజయక్రాంతి): తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను శనివారం జాతీయ గిరిజన కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ సమీక్షించారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో ఈ సమీక్ష జరిగింది. గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి డాక్టర్ ఏ శరత్ ఆధ్వర్యంలో అధికారులు తమ విభాగాలు చేపడుతున్న వివిధ కార్యక్రమాలు, వాటి పురోగతిపై కమిషన్‌కు వివరించారు. గిరిజన సంక్షేమ శాఖలోని విద్య, మౌలిక వసతుల కల్పన, ట్రైకార్, జీసీసీ విభాగాల పనితీరుపై ఆరా తీశారు. రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాల నిధులతో అమలుచేస్తున్న ఆయా పథకాల పురోగతిని గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధికారులను జాటోతు హుస్సేన్ అభినందించారు. మరింత ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు.