ప్రభుత్వ పాఠశాలల్లో పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశం
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 16(విజయక్రాంతి) : హైదరాబాద్ జిల్లాలోని 440 ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం చేపట్టిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ, డీఈవో, డిప్యూటీ డీఈవోలు, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలతో అమ్మ ఆదర్శ పాఠాలల్లో చేపట్టిన పనులపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
అనంతరం, ఆయన మాట్లాడుతూ.. పాఠశాలల్లో చేపడుతున్న పనులు నాణ్యంగా ఉండాలని, రాజీ పడకుండా పనులు చేయాలని అధికారులకు సూచించారు. ప్రతీ పాఠశాలలో మరుగుదొడ్లు, మంచినీటి వసతి కోసం మున్సిపాలిటీ ద్వారా నల్లా కనెక్షన్ అందజేయాలని, ఫ్యాన్లు, లైట్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఆయా పాఠశాలల్లో పనుల ప్రారంభానికి ముందు, పూర్తయిన తర్వాత ఫొటోలు తీయాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ షఫీమియా, జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, కో ఆర్డినేటర్ రజిత, డిప్యూటీ డీఈవోలు, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలు తదితరులు పాల్గొన్నారు.
లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు
స్కానింగ్ సెంటర్లలో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి హెచ్చరించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి మల్టీమెంబర్ అప్రోపియట్ అథారిటీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ప్రతీ స్కానింగ్ సెంటర్‌ను తనిఖీ చేయాలని, ఆ సందర్భంలో ఫొటోలు తీయాలని జిల్లా వైద్యశాఖాధికారులను ఆదేశించారు.
యువతకు గర్భస్థ లింగనిర్ధారణ నిషేధిత చట్టం గురించి అవగాహన కల్పించాలని కోరారు. బ్రూణ హత్యలను నివారించి బాలబాలికల నిష్పత్తి పెరిగేటట్లు చూడాలని సూచించారు. సమావేశంలో హైదరాబాద్ మూడవ మెట్రోపాలిటిన్ సెషన్ జడ్జి ఏ.కుమారస్వామి, జిలా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట్, అడిషనల్ డీసీపీ జీ. మనోహర్, డాక్టర్ జయమాలిని, ఎంసీహెచ్ ప్రోగ్రాం ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు.