కొత్తపేట వార్డు కార్యాలయంలో అధికారులతో కార్పొరేటర్ పవన్ కుమార్ సమావేశం...
ఎల్బీనగర్: ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులపై కొత్తపేట డివిజన్ వార్డు కార్యాలయంలో గురువారం అధికారులతో కార్పొరేటర్ పవన్ కుమార్ సమావేశం నిర్వహించి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు రేషన్ కార్డు లబ్ధిదారుల సర్వేలు నిర్వహిస్తుండడంతో కొత్తపేట డివిజన్ వార్డు కార్యాలయంలో కార్పొరేటర్ పవన్ కుమార్ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డు లబ్దిదారుల తదితర అంశాలపై వార్డు ఇన్చార్జి మాధవ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇండ్లు మొత్తం 6,600 వరకు దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 3 వేల 600 వరకు సర్వే నిర్వహించామని మాధవరెడ్డి తెలిపారు.
మిగతా 3 వేల మంది లబ్ధిదారుల వెరిఫికేషన్ మిగిలి ఉన్నదని, అన్నిచోట్ల సర్వేలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. నూతన రేషన్ కార్డుల లిస్టులు కూడా వచ్చాయని, వాటిని వెరిఫికేషన్ చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ పవన్ కుమార్ మాట్లాడుతూ.. కొత్తపేట డివిజన్ పరిధిలో ప్రతి ఒక్కరికి సంప్రదించి, అర్హులకు ఇల్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే ఫోన్ల ద్వారా వారిని సంప్రదించాలని అధికారులను కోరారు. సమావేశంలో అధికారులు హరి ప్రసాద్, సహదేవ్, శివతో పాటు నాయకులు మంచి రాజేష్, జంగారెడ్డి, సత్యనారాయణ, నిరంకి రవి, తోట మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.