సింగరేణి సీఎండీ ఎన్ బలరాం
హైదారాబాద్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రతీ మూడు నెలలకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తామని సీఎండీ ఎన్ బలరామ్ పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్‌లో జరిగిన సమీక్షకు రాష్ర్ట ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ.. సింగరేణిలో పనిచేస్తున్న ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మూడు నెలలకు ఒకసారి లైజన్ ఆఫీసర్లతో ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించాలని, ప్రమోషన్లు, పోస్టింగులలో ఈ వర్గాలకు అన్యాయం జరగకుండా చూడాలని సూచించారు.
అనంతరం సీఎండీ మాట్లాడుతూ.. చైర్మన్ చెప్పిన ప్రతీ సమస్యను తాను నమో దు చేసుకున్నానని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కమిషన్ సూచన మేరకే సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల లైజన్ సెల్ కార్యాలయాన్ని కొత్తగూడెం హెడ్ ఆఫీస్‌లో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.
దీన్ని నవంబర్ 12 ప్రారంభించనున్నట్లు తెలిపారు. సమావేశంలో కమిషన్ సభ్యులు రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మీనారాయణ, జిల్లా శంకర్, రేణిగుంట్ల ప్రవీణ్ తో పాటు సింగరేణి సంస్థ నుంచి డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్, పర్సనల్ జీ వెంకటేశ్వర్ రెడ్డి, జనరల్ మేనేజర్ కో-ఆర్డినేషన్ ఎస్‌డీ ఎం సుభానీ, జీఎంలు సుధాకర్, కవిత నాయుడు పాల్గొన్నారు.