calender_icon.png 27 April, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి ద్వారా పకడ్బందీగా రెవిన్యూ రికార్డులు

26-04-2025 06:19:33 PM

భూభారతి ద్వారా పకడ్బందీగా రెవిన్యూ రికార్డులు 

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ 

మహబూబాబాద్ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి ఆర్ ఓ ఆర్ చట్టం 25 ద్వారా భూముల రికార్డులన్నీ పకడ్బందీగా రూపొందించడం జరుగుతుందని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్(Mahabubabad District Collector Adwait Kumar Singh) అన్నారు. జిల్లాలోని బయ్యారం, గార్ల మండల కేంద్రాల్లో శనివారం భూభారతి చట్టంపై ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మచారి తో కలిసి అవగాహన సదస్సుల్లో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా, వేగంగా ప్రతి భూ సమస్యలకు పరిష్కారం లభించేలా నూతన చట్టం రూపొందించడం జరిగిందన్నారు.

రైతులకు, నిరుపేదలకు ఎలాంటి భూ సమస్యలు రాకుండా, ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఉచిత న్యాయ సేవలు అందించి, సమస్య ఉన్నచోటనే క్షేత్రస్థాయిలో పరిశీలించి భూ సమస్యను ఎమ్మార్వో స్థాయి నుండి ఆర్డిఓ, కలెక్టర్ వరకు కేటాయించిన సమయంలోనే పరిష్కరించడం ఈ చట్టం ప్రత్యేకతగా పేర్కొన్నారు. రానున్న రోజుల్లో గ్రామం పాలన అధికారి, సర్వేయర్లను నియమించి క్షేత్రస్థాయిలో రెవిన్యూ రికార్డుల నిర్వహణ భద్రంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఇల్లందు ఎమ్మెల్యే గోరం కనకయ్య మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం వినూత్నమైన సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు.

ధరణి వల్ల గత ప్రభుత్వంలో రైతులు భూ సమస్యలు తలెత్తి ఎన్ని ఇబ్బందులు పడ్డారో అందరికీ తెలుసన్నారు. ఇప్పుడు భూభారతి ద్వారా అలాంటి ఇబ్బంది లేకుండా భూ సమస్యల పరిష్కారం లభిస్తుందన్నారు. సన్న బియ్యం ప్రవేశపెట్టి పేదలు కడుపునిండా తినే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. గృహ జ్యోతి పథకం ద్వారా ప్రతి ఇంటికి ఉచితంగా 200 యూనిట్లు విద్యుత్తు ఇస్తుందన్నారు. అలాగే మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు రాష్ట్రవ్యాప్తంగా ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం కల్పించిందన్నారు. రైతులకు రుణమాఫీతో పాటు సన్న వడ్లకు క్వింటాలుకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్న ప్రభుత్వం దేశంలో ఒక్క తెలంగాణ ప్రభుత్వం మేనన్నారు.

6 గ్యారంటీల అమలులో భాగంగా త్వరలో నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. అదనపు కలెక్టర్ కె.వీరబ్రహ్మచారి అవగాహన సదస్సులో రైతుల సందేహాలకు సమాధానం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో కృష్ణవేణి, జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, సర్వే ల్యాండ్ అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహమూర్తి ఏ డి ఏ శ్రీనివాసరావు డిపిఓ హరిప్రసాద్ స్థానిక తహసిల్దార్లు విజయ, శారద, ఎంపీడీవోలు విజయలక్ష్మి, మంగమ్మ, సొసైటీ చైర్మన్ మూల మధుకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.