12-04-2025 12:19:08 AM
ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను డిజిటలైజేషన్ చేసేందుకు సిద్ధంగా ఉండాలి
పైలెట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి మండల వివరాలను సీజీజీ యాప్‌లో నమోదు చేయాలి
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 11(విజయక్రాంతి) : రెవెన్యూ అధికారులు లక్ష్యం నిర్దేశించుకుని పని చేయాలని, జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను డిజిటలైజేషన్ చేసేందుకు సిద్ధంగా ఉండాలని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆర్డిఓలు,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లులతో నిర్వహించిన రెవిన్యూ అధికారుల కాన్ఫరెన్స్‌లో అయన పాల్గొని ల్యాండ్ బ్యాంక్, ప్రభుత్వ భూముల కేటాయింపులు తదితర అంశాలపై మండలాల వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ) నిర్ణీత యాప్ లో అప్‌లోడ్ చేసేందుకు సంసిద్ధంగా ఉండాలని తహసిల్దార్లను ఆదేశించారు.
పైలెట్ ప్రాజెక్టుగా తిరుమలగిరి మండల వివరాలను ఈ నెల 22న సీజీజీ యాప్‌లో నమోదు చేయాలని, మిగతా మండలాలలో చేపట్టేందుకు తహసీల్దారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. ల్యాండ్ రికార్డ్ నిర్వహణలో రెవెన్యూ అధికారుల పాత్ర చాలా ముఖ్యమైనదని, అధికారులు లక్ష్యం నిర్దేశించుకుని ముందు కు వెళ్లాలని అన్నారు. ల్యాండ్ బ్యాంక్ మేనేజ్మెంట్ సిస్టంను అప్డేట్ చేసి వివరాలను డిజిటలైజేషన్ చేయాలని సూచించారు. ప్రభుత్వం వేరే శాఖలకు ఇచ్చిన భూములు వినియోగంలో ఉన్నవి ఎన్ని, వినియోగంలో లేనివి ఎన్ని, ఖాళీగా ఉన్నవి ఎన్ని అని గుర్తించి ఆక్రమణల గురికాకుండా ఉండేందుకు వివరాలను డిజిటలజైషన్, అప్డేషన్ చేయాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జి ముకుంద రెడ్డి, డిఆర్‌ఓ ఈ. వెంకట చారి, ఆర్డీవో సాయి రాం, సర్వే అండ్ ల్యాండ్ రికారడ్స్ ఏడి శ్రీరాం, ఈ- డిఎం రజిత,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.