- ప్రభుత్వ, అసైన్డ్ భూముల పరిరక్షణలో విఫలం
ఇబ్బడి ముబ్డడిగా చెరువులు, నాలాల ఆక్రమణ
మొద్దు నిద్రలో భద్రాద్రి జిల్లా రెవెన్యూశాఖ
భద్రాద్రి కొత్తగూడెం, జనవరి ౭ (విజయక్రాంతి): భద్రాద్రి జిల్లాలో రెవెన్యూ వ్యవస్థ గాడి తప్పింది. జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాల్లో ప్రభుత్వ, అసైన్డ్, సీలింగ్ భూములు, చెరువులు, నాలాలు, శిఖం భూముల ఆక్రమించుకుని విచ్చలవిడిగా నిర్మాణాలు జరుగుతున్నా రెవెన్యూశాఖ అధికారులు మొద్దు నిద్ర వీడట్లేదు. జిల్లా కార్యాలయంలోనే అధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వచ్చి పోతున్నారంటే ఇక మారుమూల మండలాల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.
దీంతో ప్రతి ప్రభుత్వ శాఖలోనూ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులు పేరుకుపోతున్నాయి. ఖాళీ జాగా కన్పిస్తే పాగా వేసేయ్ అన్నట్లు ఉంది జిల్లాలో పరిస్థితి. ప్రభుత్వ భూముల్లో ఆక్రమ వెంచర్లు, తప్పుడు సర్వే నంబర్లతో సీలింగ్ భూముల ఆక్రమణలు, చెరువులు నాలాలు, శిఖం భూముల పరిస్థితి దారుణంగా తయారైంది.
పోతేపోనీ.. మాకేంటి?
జిల్లాలో పగలురాత్రీ తేడాలేకుండా వాగుల్లో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. కోర్టు ఆదేశాలను సైతం అమలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వ శాఖలు పనిచేస్తున్నాయన్న విమర్శలు విన్పిస్తున్నాయి. వెంగళరావు కాలనీ సమీపంలో వందల ఎకరాల ఫారెస్టు భూమిని కేటీపీఎస్ ఉద్యోగులకు అక్రమ మార్గంలో పట్టాలు చేశారని సమాచారం.
రెవెన్యూ అధికారుల లెక్కల ప్రకారం పాల్వంచ పట్టణంలోని సర్వే నంబర్ 444లో మొత్తం విస్తీర్ణం 853.39 ఎకరాలుంటే, అందులో 387 .25 ఎకరాలు నిరుపేదలకు అసైన్ చేశారు. 16 ఎకరాలు ఆక్రమార్కుల చేతిలో ఉంది. సర్వేనం 817లో 2,361.37 ఎకరాల్లో 128 .07 ఎకరాలను నిరుపేదలకు పంపిణీచేశారు. 1,790 ఎకరాలు ఫారెస్టు భూమి, 85.14 ఎకరాలు ఆక్రమణలో ఉంది.
సర్వే నం 999లోనూ 4,169.29 ఎకరాలకు 863.23 ఎకరాలను అసైన్ చేశారు. 1,153 ఎకరాలు ఫారెస్టు భూమి కాగా 327.38 ఎకరాలు ఆక్రణకు గురైనట్టు రెవెన్యూ అధికారులే నివేదిక ఇవ్వడం గమనార్హం. తాజాగా 444 సర్వే నంబర్ భూమిలో ఎక్కడో శేఖరంబంజర్ వద్ద ఉన్న 431 సర్వే నంబర్ డాక్యుమెంట్స్ చూపి అధికారులను తప్పుదోవ వట్టిస్తూ సుమారు పదెకరాల ప్రభుత్వ భూమిలో ఓ భూబకాసురుడు ఏకంగా వెంచర్ వేస్తున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు.
హెచ్‌పీ గ్యాస్ గోదాం, ఆఫీస్‌కు భూమి అవసరం ఉందని గత నాలుగేళ్లుగా అర్జీలు పెడుతున్నా.. వారికి రెవెన్యూ అధికారులు భూమి చూపలేక పోతున్నారు. లొంగిపోయిన భూమి ఇవ్వాలన్నా, నిరుపేదలకు ఇంటిస్థలం కావాలన్నా, ప్రభుత్వ అవసరాలకు భూమి అవసరం ఉన్నా పాల్వంచ పట్టణంలో సెంటు భూమి లేదని అధికారులు చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ కు, ఆక్రమ కట్టడాలకు మాత్రం భూమి ఎక్కడి నుంచి వస్తుందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి రెవెన్యూ అధికారుల తీరుపై పలుమార్లు హెచ్చరికలు జారీచేసినా వారిలో ఎలాంటి మార్పు రాకపోవడం దారుణం. ఇకనైనా మంత్రి కల్పించుకొని ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని జిల్లా వాసులు కోరుతున్నారు.
గత కలెక్టర్ అడ్డుకుంటే..
ప్రభుత్వ భూములు ఆక్రమించి, అక్రమ నిర్మాణాలు చేసిన వారిపై అప్పటి కలెక్టర్ రజత్‌కుమార్ షైనీ ఉక్కుపాదం మోపారు. స్థానిక కేఎస్‌ఎం పెట్రోల్ బంకు నుంచి కలెక్టరేట్ వరకు రోడ్డుకు ఆనుకొని ఉన్న భూమి సర్వే నం 444/1 గా గుర్తించి ఎలాంటి నిర్మాణాలు చేయరాదని ఆదేశాలు జారీచేశారు. కానీ, ప్రస్తుతం ఆ భూముల్లో నిర్మాణలు జరుగుతున్నా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటంలేదు.
మరోవైపు నవభారత్ 444 సర్వే నంబర్‌లో సీలింగ్ భూముల్లో తప్పుడు సర్వే నంబర్లతో దొడ్డిదారిన వెంచర్ల వేసి స్థిరాస్తి వ్యాపారం చేస్తున్నా పట్టించుకొనే నాథుడే లేడు. ఇవి కలెక్టరేట్‌కు కూతవేటు దూరంలో జరుగుతున్న అక్రమాలు.
ఇక పాల్వంచ మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లి మండలంలో పాల్వంచ మున్సిపాల్టీ నంబర్ చూపి తప్పుడు డాక్యుమెంట్స్‌తో ఏజెన్సీ చట్టాలకు వ్యతిరేకంగా హెచ్ కన్వెన్షన్ నిర్మిచడమే కాకుండా ప్రభుత్వ భూమని ఆక్రమించి దర్జాగా మెటల్ రోడ్డు నిర్మించినా చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.
మరోవైపు పాల్వంచ పట్టణ పరిధిలోని గుడిపాడు మోక్షవెంకటేశ్వరస్వామి భూములు ఆక్రమణకు గురైనట్టు అనుమానించి సర్వే చేయాలని ఎండోమెంట్ అధికారులు రెవెన్యూ శాఖను కోరి నెలలు గడుస్తున్నా పట్టించుకున్న పాపాన పోలేదు.