సంగారెడ్డి,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం లగచర్లలో కలెక్టర్ సహా తహశీల్దార్ ఇతర అధికారులపై దాడిని ఖండిస్తూ, ట్రేసా రాష్ర్ట అధ్యక్షులు వంగా రవీందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గౌతమ్ కుమార్ ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)లో రెవెన్యూ ఉద్యోగులు మంగళవారం నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రాములు, కార్యదర్శి కిరణ్ కుమార్ మాట్లాడుతూ... వికారాబాద్ జిల్లా కలెక్టర్, తహశీల్దార్, ఇతర ఉద్యోగులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విధి నిర్వహణలో భాగంగా గ్రామానికి వెళ్లిన అధికారులపై క్రిమినల్స్ తరహాలో మూకుమ్మడిగా దాడి చేయడం శోచనీయమని ఆక్షేపించారు. ఈ దాడికి పాల్పడిన వాళ్లందర్నీ వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేంత వరకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులందరు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరవడం ద్వారా తమ నిరసనను కొనసాగించాలని నిర్ణయించడం జరిగిందన్నారు.
ఇటీవల కాలంలో రెవెన్యూ ఉద్యోగుల పైన దాడులు నిత్యకృత్యంగా మారాయని ఆందోళన వెలిబుచ్చారు. దాడులను అరికడుతూ రెవెన్యూ ఉద్యోగులకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం కఠిన చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ కి కలసి వినతిపత్రం అందచేశారు. నిరసన కార్యక్రమంలో ఏవో పరమేశ్వర్, జిల్లాలోని తహసీల్దార్ లు రెవెన్యూ ఉద్యోగుల సంఘం జిల్లా అసోసియేట్ అధ్యక్షులు రాములు, ఆయా విభాగాల పర్యవేక్షకులు కలెక్టర్ కార్యాలయ సిబ్బంది, ఆయా మండల , డివిజన్ కార్యాలయ రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. తదుపరి జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ బాధ్యలపై తగు చర్యలు తీసుకోవలసిందిగా వినతి పత్రం సమర్పించారు.