calender_icon.png 26 December, 2024 | 2:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతిలో రెవెన్యూశాఖ టాప్!

26-12-2024 02:18:31 AM

  • రెండు, మూడు స్థానాల్లో విద్యుత్, రిజిస్ట్రేషన్ శాఖలు 
  • యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ సర్వేలో వెల్లడి
  • రిపోర్ట్ విడుదల చేసిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
  • అవినీతి రిపోర్ట్ ప్రభుత్వంపై విమర్శ కాదని ప్రకటన

హైదరాబాద్, డిసెంబర్ 25 (విజయక్రాంతి): ‘దశాబ్దాలు మారుతున్నా వ్యవస్థలో మాత్రం మార్పు రావడం లేదు. డబ్బులు ముట్టజెప్పనిదే ప్రభుత్వ విభాగాల్లో పనులు జరగడం లేదు. ఫైళ్లు కదలడం లేదు’ అనే అభిప్రాయాలను నిజం చేసేలా ‘యూత్ ఫర్ యాంటీ కరప్షన్’ సంస్థ తెలంగాణలో నిర్వహించిన సర్వే వెల్లడించింది.

అవినీతిలో రెవెన్యూశాఖ టాప్‌లో నిలిచినట్లు ప్రకటించింది. ఈ సంస్థ ఇటీవల ప్రభుత్వశాఖల్లో అవినీతి, నాయకుల పనితీరుపై సర్వే నిర్వహించింది. సర్వే నివేదికను యూత్ ఫర్ యాంటీ కరప్షన్ ప్రధాన సలహదారు, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, సంస్థ ఫౌం డర్ పల్నాటి రాజేంద్ర బుధవారం విడుదల చేశారు. రిపోర్ట్‌లో ప్రభుత్వశాఖల వారీగా ఎంత మేర అవినీతి జరుగుతున్నదనే వివరాలు వెల్లడించారు. 

సర్వేలో పాల్గొన్న వారు 14 వేల మంది..

రాష్ట్రంలో ప్రభుత్వశాఖల్లో అవినీతి ఏ స్థాయిలో ఉందనే అంశంపై యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ వలంటీర్లతో సర్వే నిర్వహించింది. వలంటీర్లు గ్రామం, పట్టణం, నగరాలు, జిల్లాకేంద్రాల వారీగా మొత్తం 14,345 మంది అభిప్రాయాలు సేకరించారు. సంస్థ నిర్వాహకులు సర్వే నివేదికను రాష్ట్రప్రభుత్వానికి అందజేయనున్నారు.  

శాఖల వారీగా అవినీతి

రెవెన్యూ  76.7, విద్యుత్తు   59.7, రిజిస్ట్రేషన్  55.4, పోలీస్  52.3, మున్సిపల్   49.4, ఎక్సుజ్   47.8, ట్రెజరీ  46.4, రవాణా  42.1, పంచాయతీరాజ్   39.2, ఆసుపత్రులు (వైద్యశాఖ)  37.7, ఇరిగేషన్   34.9, బ్యాంకింగ్  33.3, విద్య   31.7, అగ్నిమాపక   31.2, సోషల్ వెల్ఫేర్  30.7, కాలుష్య నియంత్రణ  29.9, ఎన్జీవో  29.3, అటవీశాఖ   28.2 శాతం అవినీతి నమోదైంది.

సర్వే నిర్వహణ తీరు..

* తెలంగాణలో అవినీతి ఉందా? లేదా? అనే ప్రశ్నకు 76 శాతం మంది అవినీతి ఉందని, 14శాతం సాధారణమేనని సమాధానమిచ్చారు.

* లంచం ఇవ్వకపోతే ఎలాంటి పని కావడం లేదని 47.9 శాతం మంది, అధికారులు ఇబ్బంది పెడుతున్నారని 28.4శాతం మంది చెప్పారు.

* ‘మీరు లంచం ఏ రూపంలో ఇచ్చారు’ అని ప్రశ్నించగా 63.7 శాతం మంది నగదు అని చెప్పగా, 34.2 శాతం మంది వస్తు రూపేణా ఇచ్చామని వెల్లడించారు.

* ‘మీ ప్రాంతంలో నిజాయితీగా పనిచేసే అధికారులు ఉన్నారా ?’ అనే ప్రశ్నకు, నిజాయి తీపరులే లేరని 63శాతం మంది చెప్పగా, ఉన్నారని  20శాతం మంది చెప్పారు.

* ‘ఏసీబీ, సీబీఐ, ఈడీతో అవినీతి తగ్గుతుందా ?’ అని ప్రశ్నించగా, ‘కొంచెం జరుగుతుంది’ అని 48.6శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. వాటితో ప్రయోజనం లేదని 26 శాతం మంది                 తెలిపారు.

* ‘మీరు ప్రభుత్వ అధికారులతో ఎలా పనిచేయించుకుంటున్నారు ?’ అనే ప్రశ్నకు 43శాతం మంది లంచమేనని సమాధానమిచ్చారు. న్యాయపోరాటం ద్వారా సాధించు కుంటున్నామని                   41శాతం మంది చెప్పారు.

* ‘అవినీతికి ప్రధాన కారణం ఎవరు?’ అని ప్రశ్నించగా 65 శాతం మంది ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు, నాయకులని సమాధానమిచ్చారు.

* ‘అధికారులు లంచం ఎవరి ద్వారా తీసుకుంటారు ?’ అని ప్రశ్నించగా 54.8శాతం మంది బ్రోకర్ల ద్వారా తీసుకుంటున్నారని సమాధానమిచ్చారు. 30.8 శాతం మంది సరాసరి                                      తీసుకుంటున్నారని  వెల్లడించారు.

* ‘ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లినప్పుడు అధికారులు మీకు మర్యాద ఇస్తున్నారా ?’ అని ప్రశ్నించగా 64.4శాతం మంది లేదు అని జవాబు ఇవ్వగా, 16.4శాతం మంది దురుసుగా ప్రవర్తిస్తారని            వెల్లడించారు. 

* ‘బ్రోకర్ వ్యవస్థతోనే అవినీతి పెరుగుతుందా ?’ అనే ప్రశ్నకు 47.9శాతం మంది ‘అవును’ అని, 28.1శాతం మంది వారే ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు.

* ‘రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం పనితీరు ఏలా ఉంది’ అనే ప్రశ్నకు 41.8శాతం మంది ఫర్వాలేదని, 25.3 శాతం బాగా లేదని సమాధానమివ్వగా, 23.3శాతం అధ్వానమని జవాబిచ్చారు.

* ‘మీరు ఓటేసిన వ్యక్తులు ఎన్నికల్లో గెలిచి, ప్రజాప్రతినిధులైన తర్వాత.. మీరు సమస్యలు చెప్పుకునేందుకు వెళితే కలిసే అవకా శం ఇస్తున్నారా?’ అనే ప్రశ్నకు 36.3శాతం మంది రోజుల                 తరబడి  ప్రజాప్రతినిధుల వెంటపడాలనే సమాధానం వచ్చింది. 24 శాతం మంది అసలు ప్రజాప్రతినిధులు ఎక్కడుంటారో తెలియదని జవాబు ఇచ్చారు.

సర్వే ప్రభుత్వ పనితీరును ఎత్తి చూపడం లేదు

మేం కేవలం సర్వే రిపోర్టు క్షేత్రస్థాయిలో ఉందని మాత్రమే చెప్తున్నాం. సర్కార్ రిపోర్టును చూసి అవినీతి నిర్మూలనకు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తు న్నాం. అవినీతి యావత్ ప్రపం చాన్ని పట్టిపీడిస్తున్న సమస్య. అవినీతిపై ‘ట్రాన్స్ పరేషన్ ఇంటర్నేషనల్’ అనే సంస్థ ఏటా సర్వే నిర్వహించి ప్రపంచ దేశాలకు ర్యాంకు ఇస్తుంది.

నార్వే, స్వీడన్, స్విట్జర్లాండ్ వంటి దేశాల్లో అవినీతి లేదని ఆ సంస్థ తేల్చింది. అవినీతి అనే జాడ్యం అధికారులను సరిగ్గా పనిచేయనీయదు. అభివృద్ధి పనుల్లోనూ నాణ్యతా ప్రమాణాలు లోపిస్తాయి. ప్రభుత్వం ఎవరూ బాగా పనిచేస్తే, ఆ అధికారికి రోస్టర్ పద్ధతిలో పోస్టింగ్ ఇవ్వాలి. 

 సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ