ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన హైకోర్టు
హైదరాబాద్, నవంబర్ 11 (విజయక్రాంతి): వ్యవసాయ భూములపై హక్కులను ధ్రువీకరించే అధికారం రెవెన్యూ అధికారులకు లేదని హైకోర్టు సోమవారం స్పష్టంచేసింది. తహసీల్దార్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఎవరూ హక్కులను ధ్రువీకరిస్తూ స్వాధీన పత్రాన్ని జారీ చేయజాలరని పేర్కొంది.
తెలంగాణ పట్టాదారు పాసు పుస్తకాల చట్టం 2020 ప్రకారం స్వాధీన పత్రం జారీచేసే అధికారం రెవెన్యూ సిబ్బందికి లేదని ఉద్ఘాటించింది. ఆ అధికారం కేవలం సివిల్ కోర్టులకే ఉందని, అధికరణ 226 కింద రిట్ పిటిషన్‌లో హక్కులను ధ్రువీకరించే అధికారం హైకోర్టులకూ లేదని చెప్పింది.
యాదాద్రి భువనగిరి జిల్లా తూఫ్రాన్‌పేట్ గ్రామంలోని సర్వే నంబర్ 122లోని 2 ఎకరాల భూమికి హక్కులను ధ్రువీకరిస్తూ స్వాధీన పత్రాన్ని జారీచేయడాన్ని సవాల్ చేస్తూ నార్లకొండ మల్లయ్య తదితరులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి సోమవారం విచారణ చేపట్టారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది చెలికాని వెంకటయాదవ్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ 1985లో సాదాబైనామా ద్వారా ఈ భూమిని కొనుగోలు చేశారన్నారు. క్రమబద్ధీకరణ దరఖాస్తు పెండింగ్లో ఉండగా భూమిని విక్రయించిన వ్యక్తి, అతని కుమారుడు తాడూరి వెంకటరెడ్డి అధికారుల సాయంతో భూమిని ఇతరులకు విక్రయించి, హక్కు పత్రాన్ని పొందారని చెప్పారు.
రెవెన్యూ ఇన్స్‌పెక్టర్, తహసిల్దార్లు భూమికి సంబంధించిన నివేదికను ఆర్డీవోకు, ఆర్డీవో.. కలెక్టర్‌కు పంపారని పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా కలెక్టర్ ప్రతివాదులకు స్వాధీన పత్రాన్ని జారీ చేశారని చెప్పారు. స్వాధీన పత్రాన్ని ఏ నిబంధన కింద జారీ చేశారన్న విషయాన్ని కలెక్టర్ ఉత్తర్వుల్లో పేర్కొనలేదని అన్నారు.
వాదనలను విన్న న్యాయమూర్తి రెవెన్యూ అధికారుల తీరును తప్పుబట్టారు. కలెక్టర్ జారీచేసిన ధ్రువీకరణ పత్రం ఆ భూమికి సంబంధించి యథాతథ స్థితిని కొనసాగించాలని చెప్పారు. పూర్తి వివరాలు సమర్పించాలంటూ కలెక్టర్, రెవెన్యూ అధికారులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.