గయానా: అంచనాలకు అనుగుణంగా రాణిస్తూ వచ్చిన టీమిండియా.. వన్డే ప్రపంచకప్‌లో కీలక సమరానికి సిద్ధమైంది. ఇప్పటి వరకు ఒక మ్యాచ్ ఓడినా పుంజుకునేందుకు అవకాశం ఉండగా.. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో కడవరకు కొట్లాడే వాల్లనే కప్పు వరించనుంది. ఐసీసీ టోర్నీల్లో ఆసాంతం నిలకడగా రాణించి.. నాకౌట్ దశలో చేతులెత్తేస్తూ.. దశాబ్దానికి పైగా చాంపియన్ బిరుదుకు దూరంగా ఉండిపోయిన టీమిండియా నేడు టీ20 వరల్డ్‌కప్ సెమీఫైనల్లో ఇంగ్లండ్‌తో అమీతుమీ తేల్చుకోనుంది.
గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లతో పాటు.. సూపర్ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన రోహిత్ సేన ఫుల్ జోష్‌లో సెమీస్‌లో అడుగుపెట్టగా.. ‘దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షు’ అన్నట్లు ప్రతి మ్యాచ్‌లోనూ పోరాడి గెలిచిన డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ పడుతూ లేస్తూ సెమీస్‌కు చేరింది. ఇరు జట్ల మధ్య చివరిసారిగా 2022 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ మ్యాచ్ జరగగా.. దాంట్లో ఇంగ్లిష్ టీమ్ 10 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఈ ఫార్మాట్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య మరో మ్యాచ్ జరగలేదు. దీంతో విశ్లేషకులు దీన్ని ప్రతీకార పోరుగా అభివర్ణిస్తున్నారు. అప్పటికీ, ఇప్పటికీ భారత జట్టులో పెద్దగా మార్పులు లేకపోగా.. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఉండటం టీమ్‌కు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తోంది.
పేపర్ మీద చూసుకుంటే ఇరు జట్లు సమ ఉజ్జీలుగానే కనిపిస్తున్నా.. విరాట్ కోహ్లీ ఫామ్ మేనేజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది. ఈ మెగాటోర్నీలో ఓపెనర్‌గా ప్రమోషన్ పొందిన విరాట్.. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చడంలో విఫలమవుతూ వస్తున్నాడు. ఇప్పటికే రెండు సున్నాలు తన పేరిట రాసుకున్న కోహ్లీ.. కీలక పోరులో సత్తాచాటాలని జట్టు యాజమాన్యం ఆశిస్తోంది. రోహిత్, పంత్, సూర్య జోరు కొనసాగిస్తే భారీ స్కోరు ఖాయమే. అయితే మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉండగా.. మిడిలార్డర్‌లో రవీంద్ర జడేజా రాణించాల్సిన అవసరముంది. బౌలింగ్ విషయానికి వస్తే.. ప్రత్యర్థులంతా బుమ్రా బౌలింగ్‌తో బెంబేలెత్తిపోతుంటే.. చాపకింద నీరులా అర్ష్‌దీప్ వికెట్ల పండగ చేసుకుంటున్నాడు.
కుల్దీప్ తన స్పిన్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. ఇక ఐపీఎల్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న హార్దిక్ పాండ్యా.. తన విలువ ఏంటో చాటుకుంటున్నాడు. వీరంతా మరో రెండు మ్యాచ్‌ల్లో ఇదే జోరు కొనసాగిస్తే.. టీమిండియా జగజ్జేతగా నిలవడం ఖాయమే! మరోవైపు ఇంగ్లండ్ జట్టు నిండా హిట్టర్లతో పటిష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్ బట్లర్, సాల్ట్, బెయిర్‌స్టో, బ్రూక్, మోయిన్ అలీ, లివింగ్‌స్టోన్, సామ్ కరన్‌తో బ్యాటింగ్ శత్రుదుర్బేధ్యంగా ఉండగా.. బౌలింగ్‌లో ఆది ల్ రషీద్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్ కీలకం కానున్నారు. ముఖ్యంగా రషీద్ ఈ టోర్నీలో చక్కటి ప్రదర్శన కనబరుస్తుండగా.. జోర్డాన్ హ్యాట్రిక్ తీసి జోరుమీదున్నాడు. మరి కీలక పోరులో ఎవరిది పైచేయి అవుతుందో చూడాలి!