calender_icon.png 23 November, 2024 | 6:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విహారయాత్రతో సత్యావిష్కరణ

23-11-2024 12:46:02 AM

“మీకు స్వాతంత్య్రం ఇచ్చాం. తిరిగి మాకేం ఇస్తారు?” అని చివరి వైస్రాయి లార్డ్ మౌంట్ బ్యాటన్ అడిగినప్పుడు, మహాత్మా గాంధీ ఆయనకు ‘సత్యార్థ ప్రకాశం’ ఇచ్చినట్లు చెప్తారు. ఇంతటి విలువైన గ్రంథం భారతీయులంతా చదువక పోవడం దురదృష్టకరమే. ఇంతెందుకు, ఢిల్లీ విహారయాత్రకు ముందు నేనుకూడా చదవలేదు. 

ఒక విహారయాత్ర పుణ్యమా అని నాతోపాటు పలువురు విద్యార్థులకూ గొప్ప సత్యావిష్కారం కలగడం అదృష్టమే. ఏదో కాలక్షేప ప్రయాణం వలె కాకుండా జీవితాలకు మార్గ నిర్దేశనం చేసిన అలాంటి సందర్భాలు చాలా అరుదుగానే సంభవిస్తాయి. తెలుగు ఎంఏ చదివే పిల్లలను తీసుకొని ఎక్స్‌కర్షన్‌కు వెళ్లాలని అప్పటి మా ప్రిన్సిపాల్ సౌందర్‌రాజన్ హుకుం జారీ చేశారు. ఎక్స్‌కర్షన్‌కు రావడానికి ఇరవైమంది విద్యార్థులు సిద్ధమ య్యారు. అది ఉత్తర భారతదేశపు యాత్ర. ఢిల్లీ, ఆగ్రా, హరిద్వార్ వంటి ప్రాంతాలను చూడాలని రైలులో బయల్దేరాం. విద్యార్థులందరికీ నేనొక్కడినే కస్టోడియన్‌ను. 

ఉత్తర భారతదేశ యాత్ర నాకూ కొత్తే. మొదట ఢిల్లీ చేరి, శక్తినగర్‌లోని ‘ఆర్య సమాజం’ వారి గృహంలో బస చేయడానికిగాను, నాతోటి ప్రొఫెసర్ ఒకరిద్వారా సిఫారసు లేఖ తీసుకున్నాను. అనుకున్నట్లే అక్కడ ఉన్నాం. ఆగ్రాకు వెళ్లి తాజ్‌మహల్ దర్శించాం. కుతుబ్‌మినార్ అధిరోహిం చాం. ఇంకా, ఢిల్లీలోని జంతర్‌మంతర్, పార్లమెంటు భవనం వంటి ప్రదేశాలూ చూసి వచ్చాం. చివరికి సుప్రీం కోర్టు భవనాన్ని తిలకించడానికి వెళ్లాం.

ఆ రోజు ఆదివారం. కనుక, ఎక్కువ రద్దీ లేదు. నేను అప్పట్లో కేవలం సఫారీ దుస్తుల్లోనే ఉండేవాణ్ణి. దూరం నుంచి చూసి వెళ్దామని నేను నా విద్యార్థులకు చెప్పాను. కానీ, వారు వినలేదు. భవనం లోపలకు వెళ్దామన్నారు. సఫారీ డ్రెస్సులో ఉన్న నన్ను ఒక ద్వారపాలకుడు చూసి, ‘పెద్ద ఆఫీసరు’ అనుకున్నాడో ఏమో, సెల్యూట్ చేసి లోపలకి అనుమతించాడు. నాతోపాటు ఒక ఇద్దరికి మాత్రం ప్రవేశం లభించింది. మిగిలిన వారంతా వెలుపలే ఉన్నారు. మేం లోపల పది నిమిషాలు ఉండి బయటకు వచ్చాం. 

అంతా ఇలా సవ్యంగా జరిగితే ఏ బాధా ఉండేది కాదు. కానీ, బయట మా విద్యార్థులు కొన్ని ఫొటోలు తీశారు. అక్కడ ‘ఫొటోగ్రఫీ నిషేధం’ అన్న సంగతి వారికి తెలియదు. హెచ్చరిక బోర్డు ఇంగ్లీషులో ఉంది. కానీ, అదేమీ పట్టించుకో కుండా విద్యార్థులు ఫొటోలు తీశారు. నేను బయటికి వచ్చేసరికి సెక్యురిటీ వారు ఇద్దరు విద్యార్థులను పట్టుకొని విచారిస్తున్నారు. నేను జాగ్రత్తగా అడుగులు వేస్తూ, నాకు సెల్యూట్ చేసిన ద్వారపాలకునితో “ఆ విద్యార్థులను విడిపించమని” అర్థించాను. అర్థం చేసుకున్న అతను మా విద్యార్థులిద్దరినీ విడిపించాడు. ఎలాగైతేనేం, ‘బతుకు జీవుడా’ అని అక్కడ్నించి బయటపడ్డాం. 

“సార్! మీరు సఫారీ డ్రెస్సు వేసుకొని ఉండడం వల్లే మేము బయట పడగలిగాం. నిజంగానే సఫారీలో మీరు పెద్ద ఆఫీసరువలె కనిపిస్తారు..” అన్న విద్యార్థుల మాటల్లో ఆశ్చర్యమేమీ లేదు. ‘మన డ్రెస్సుకూడా ఒక్కోసారి మనల్ని రక్షిస్తుందని’ నాకు అప్పుడే బోధపడింది. ఉద్యోగంలో చేరినప్పట్నించీ సఫారీ డ్రస్సు వేసుకోవడం అలవాటైంది. తర్వాత లాల్చీ పైజామాకు మారాను. విహారయాత్ర అసలు ప్రభావం ఆ తర్వాతే మొదలైంది.

విద్యార్థులతో విహారయాత్ర నిర్వహణ చాలా కష్టం. ఒక్కొక్క విద్యార్థిది ఒక్కో అభిరుచి. అయినా, నిర్వాహకుడు ఎంతో సహ నం పాటించాలి. శక్తినగర్ ‘ఆర్య సమాజం’లో మేం వారం రోజులు ఉన్నాం. సాత్విక ఆహారం అలవాటైంది విద్యార్థులకు. అది ‘ఆర్య సమాజం’ కనుక అక్కడ ఉండాలంటే వారి నియమాలను తప్పక పాటించాల్సిందే. ప్రాతఃకాలంలో 5 గంటలకే నిద్రనుంచి మేల్కొనాలి. చన్నీటి స్నానం చెయ్యాలి. కొద్దిసేపు ధ్యానంలో కూర్చోవాలి.

యజ్ఞంలో పాల్గొనాలి. నా విద్యార్థులకు ఇవన్నీ కొత్తే. కానీ, పాటించక తప్పదు. ఇంత కఠిన నియమాలు ఉంటాయని పాపం వారికీ తెలియదు. అన్నింటికీ మించి ఉప్పు, కారం తక్కువున్న ఆహారం భుజించాలి. అందరూ ఈ వీటికి బద్ధులై వారం రోజులు గడిపారు. 

మలుపు తిప్పిన నియమాలు

‘ఆనాటి ఆర్య సమాజ నియమాలు జీవితాలలో ఎంతో మార్పు తెచ్చాయని’ ఇప్పటికీ ఆ విద్యార్థులు అంటున్నారు. ఇంతెందుకు, నా జీవితంలోనూ గొప్ప మార్పు రావడానికి అక్కడున్న ఆ వారం రోజులే కారణమని చెప్పక తప్పదు. ఆర్య సమాజాన్ని దయానంద సరస్వతి స్థాపించారు. ఆ మహర్షి రచించిన ‘సత్యార్థ ప్రకాశం’ గ్రంథం నాకు అప్పటికే ఎవరో ఇచ్చారు. కానీ, దాన్ని తెరిచి చూడలేదు. అది సనాతన ధర్మాన్ని అద్భుతంగా తెలియజేస్తుంది.

వేద సందేశానికి రసానుగు ణంగా రూపొందింది. నిజానికి అదొక ధర్మగ్రంథమే కాదు, పరిశోధనా గ్రంథం కూడా. దయానంద సరస్వతి మూడు వేల రెఫరెన్సులతో దానిని రచించారు. భారతీయ సంస్కృతిపట్ల గౌరవం ఉన్న ప్రతి ఒక్కరూ చదవదగిన పుస్తకం అది.

“మీకు స్వాతంత్య్రం ఇచ్చాం. తిరిగి మాకేం ఇస్తారు?” అని చివరి వైస్రాయి లార్డ్ మౌంట్ బ్యాటన్ అడిగినప్పుడు, మహాత్మా గాంధీ ఆయనకు ‘సత్యార్థ ప్రకాశం’ ఇచ్చినట్లు చెప్తారు. ఇంతటి విలువైన గ్రంథం భారతీయులంతా చదువక పోవడం దురదృష్టకరమే. ఇంతెందుకు, ఢిల్లీ విహారయాత్రకు ముందు నేనుకూడా చదవలేదు. ఎప్పుడైతే ఆ వారం రోజులు ‘ఆర్య సమాజ’ మందిరంలో ఉండి, వారి నియమాలను తెలుసుకొని, పాటించానో అప్పుడే ఆ భావనలవైపు మళ్లాను.

అనంతరం పండిత గోపదేవ శాస్త్రి అంతటి మహానుభావునికి శిష్యుణ్ణి అవడం వెనుక ఈ ఉదంతం ఇచ్చిన స్ఫూర్తినీ కాదనలేను. ఢిల్లీలో అన్ని ప్రాంతాలూ చూశాక, మా విద్యార్థులు తప్పనిసరి శక్తినగర్‌లో సాయంత్రాలు ‘సత్యార్థ ప్రకాశం’ ప్రవచనాలు వినవలసి వచ్చింది. వారు హిందీ లో చదివితే మా పిల్లలకు భాషరాక ఇబ్బం ది పడ్డారు. విహారయాత్ర ముగించుకొని వచ్చాక, వారికి గోపదేవ శాస్త్రి తెనిగించిన ‘సత్యార్థ ప్రకాశం’ అందించాను.

నేను కూడా దాన్ని చదవడం మానలేదు. ఈ విహారయాత్ర పుణ్యమా అని అప్పటి మా విద్యార్థులకు ‘ఆర్య సమాజం’ గొప్పదనం తెలిసివచ్చింది. పండిత గోపదేవ శాస్త్రివద్ద దర్శనాలు, ఉపనిషత్తుల అధ్యయనం కొనసాగించడం, వైదిక ధర్మంపై వందలాది వ్యాసా లు రాయడం మొదలైన నా జీవన పరిపక్వతకు కాకతాళీయంగా సాగిన ఆ పర్యటనే బలమైన పునాది వేసింది. వేద ధర్మ ప్రచారమే జీవన కార్యంగా మారిన నా పదవీ విరమణానంతర కాలానికీ ఇదే మార్గ నిర్దేశనం చేసింది.

- వ్యాసకర్త సెల్: 9885654381