calender_icon.png 4 March, 2025 | 5:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ శంకర భారతి భజగోవిందం

02-03-2025 12:00:00 AM

శంకర భగవత్పాదులు మహాదార్శనికుడిగా జీవిత పరిసత్యాలను అనేక కోణాలలో ఆవిష్కరించి, మానవమేధకు తాత్త్విక చింతనను జోడించారు. మానవుడు, తన జీవితకాలంలో ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే ఆలోచనా స్రవంతికి అక్షరరూపం ఇచ్చారు. దుఃఖానికి, అపజయానికి, ఆశాభంగాలకు మూలమైన అనేక కారణాలను స్పృశిస్తూ, ఆలోచనాగ్ని రగిల్చి, ఉపదేశంగా తీర్చిదిద్దుతూనే, కనిపిస్తున్న గురువునీ, కనపడని భగవంతుణ్ణి, అంటే అంతరాత్మను అనుసరిస్తూ జీవితాన్ని ఆనంద నందనం చేసుకోమన్నారు. ఆధునిక మానవ జీవనశైలిలో వస్తున్న విపరీత ధోరణులకు, పరిణామాలకు ఉపశమన యోగంగా శంకరులు అనుగ్రహించిన విచారధారే భజగోవిందమ్.

జీవితమంటే ఎన్నో విషయాలను తెలుసుకోవటం మాత్రమే కాదు, వాటిని ఆచరించటం కూడా! మానవ జీవితం అత్యంత పరిమితమైంది. లక్ష్యగమ్యాలు దూరం తరగనివి. అందుకే దారి చూపించి, ఒడుపు నేర్పే గురువును, అంతరంగ శక్తిగా, భావనగా వెలిగే దైవాన్ని స్మరిస్తూ, జీవితాన్ని జీవించాలి. మితిమీరిన సంపదలు సంపాదించి, మోహ, వ్యామోహ, వ్యసనాలు పెంచుకునేకంటే మంచి ఆలోచనలు, మంచి పనులు చేసి, ధర్మమార్గంలో పొందిన సంపదను ఆనందంగా అనుభవించాలి. ఆశ వుండాలి. దురాశ ఉండకూడదు. అది దుర్దశకు దారితీస్తుంది.

సృష్టిలో ఏ లోపమూ లేదు. ఉన్నదంతా చూసే చూపులోనే ఉంది. స్త్రీ సౌందర్యం ఉత్తముడికి ఆహ్లాదం కలిగిస్తుంది. అధముడికి ఆతృత కలిగిస్తుంది. ధర్మకామం వల్ల వ్యక్తికి, వ్యవస్థకు నష్టమేమీ లేదు. ఇంద్రియ నిగ్రహమే చేయవలసిన సాధన. డబ్బుంటే లోకం నీ చుట్టూ వుంటుంది. అది లేని నాడు లోకం నిన్ను వీడుతుంది. తరిగిపోయే, కరిగిపోయే లౌకిక ధనంతోనే స్థితి, గతీ ఏర్పడతాయి. కదలని సిరే ఉత్తమ విద్య. అదే ఆత్మవిద్య. అది వినయాన్ని, వివేకాన్ని, విచక్షణను, తృప్తిని, ప్రశాంతతను అనుగ్రహించి, ఆనందాన్ని కలిగిస్తుంది.

దేహమే శివం.. అది లేనప్పుడు శవం!

ఒంట్లో ఊపిరున్నంతసేపూ మన దేహం శివం. శివం లేనపుడు శవం. శరీరానికున్న పరిమితి ఇది. ఉన్నంత కాలమూ అంటి పెట్టుకుని వున్న భార్య సైతం తన భర్త శవాన్ని చూసి భయపడుతుంది. గడపదాటి బయటకు వచ్చే అవకాశం లేదు. అయితే లోకంలో ఉన్నతంగా, శక్తివంతంగా, సర్వహితంగా జీవించటానికి ఈ శరీరమే సాధనం. గుర్తెరిగి వర్తిస్తే శ్రేయోదాయకం. ఎవరికి ఎవరు? ఎవరి మూలాలు ఏవి? ఎవరికీ తెలియదు. జీవన ప్రవాహంలో కలుసుకుని కొంత దూరం, కొంత కాలం ప్రయాణించే సహయాత్రీకులం. ఈ సత్యం తెలుసుకుని స్పృహతో జీవించగలగటం ఎంతో అవసరం.

మంచివారితో, మంచి విషయాలతో, మంచి పనులతో అంటే ఆత్మవిద్యకు దారి తీయించే సంగతులతో ఎప్పుడూ కూడి వుండాలి. దాని వల్ల ప్రపంచమూ, దాని పోకడ, రీతి వంటివన్నీ అర్థమై, లోకానికి లోబడి, దురాశతో బతికే ప్రమాదం తప్పుతుంది. విచక్షణ, -వివేకం కలిగి ఆశ, దురాశగా మారదు. ఏది ఎంతవరకు కావాలో అంతే పొందుదామన్న భావన నిలకడ చెందుతుంది. ఆశలు నెమ్మదిస్తున్నందున మనసు పరిమిత కోర్కెలతో ప్రశాంతంగాను, నిశ్చలంగానూ ఉంటుంది.

శుద్ధత్వమూ, సిద్ధత్వమూ కలుగుతాయి. సంసార పరమైన బాధ్యతలను ఉదాత్తంగా నిర్వహించగల చిత్తశుద్ధి కారణంగా, ఏమీ అంటించుకోని స్తిమితత్వం లభిస్తుంది. ఈ క్రమంలో ప్రపంచం పట్ల మనసు ఏర్పరచుకునే మోహ, వ్యామోహాలు, తీవ్ర భావనలు నశిస్తాయి. మోహ క్షయమే మోక్షం. మోక్షమంటే మరణానంతర సుఖం కాదు. మోక్షమంటే నిర్మలానందం, నిశ్చలానందం, నిరంజనానందం. అటువంటి ఆనందమే జీవితానందం.

జీవితమంటే నిజానికి రోజూ కొంత పోగొట్టుకోవటమే. పుట్టినరోజు పండుగ జరుపుకుంటాం. దేనికి? గడచిన దానికా? వచ్చిన దానికా? మార్పుకా? ఏమో! తరుగుతున్న వయసుతో కామవికారమూ నశిస్తుంది. హరించి పోతున్న సిరితో బంధువర్గమూ తరలిపోతుంది. నీరింకితే చెరువున్నదా? ఉనికీ, అస్తిత్వమూ నశిస్తున్నవి కదా! నిజతత్త్వమెరిగితే? మారేది దేహమూ, దానిని ఆశ్రయించిన ప్రపంచమే కానీ వాటికి మూలమైన ‘ఆత్మ’ కాదని స్పృహ కలిగితే, ఇక ప్రపంచ భావనకు చోటెక్కడ?

బంధుజన బలం.. బలం కాదు. యౌవన బలం.. బలం కాదు. ధన బలమూ బలం కాదు. ఈ మూడూ నిజానికి ఎంతో కాలం ఉండవు. కనురెప్ప పాటులో కాలం వీటన్నిటినీ హరించివేస్తుంది. కనిపిస్తున్నవి, అనిపిస్తున్నవీ అన్నీ మంచుతెర కమ్ముకున్నవే! పంచదార బొమ్మలే! క్షణంలో కరిగిపోయేవే! కరగని, తరగని, ఒరగని, జరగని బ్రహ్మానందాన్ని, శాశ్వత స్థాయిని పొందే అచ్చతెలివిని సంపాదించుకోవాలి. కాలచక్రం ఆగదు.

దేనినీ ఆపదు. చీకటి ఆశ ఎత్తు జయం జననం ఇవన్నీ పైకీ, కిందకీ ఆగకుండా కదిలే చక్రంలోని ఆకులే. వీటికి స్థిరత్వం లేదు. స్థిమితం లేదు. కాలం ఆడుకునే ఈ ఆటలో, ఆటను చూస్తున్న మనిషి ఆయువు ఆవిరైపోతుంది. అన్నీ తెలిసీ, ఇదంతా చూసి కూడా, మానవుడు తనలోని ఆశలను, ఆకాంక్షలను, అహంకారాన్ని, మమకారాన్ని వదులుకోలేక పోతున్నాడు.

వైరాగ్యమూ వైభోగమే! ప్రపంచమూ మధుర సౌందర్యమయమే! అశాశ్వతత్వం నుంచీ శాశ్వతత్త్వంలోకి, పరిమితి నుంచీ అపరిమితంలోకి, ఊహనుంచీ వాస్తవికతలోకి, వాస్తవికత నుంచీ అధివాస్తవికతలోకి.... ఏటివాలు ప్రయాణంగా తీర్చిదిద్దే అధ్యాత్మ ప్రస్థానమే భజగోవిందం. అదే మోహముద్గర. పన్నెండు శ్లోకాలలో మానవుడి అశాంతికి మూలమైన విషయ ప్రస్తావనే ద్వాదశ మంజరీక స్తోత్రం. ఏ పేరున పిలుచుకున్నా సనాతన బోధకుడి, సనూతన దివ్య భావలహరి భజ గోవిందం.

- వి.యస్.ఆర్.మూర్తి