calender_icon.png 24 October, 2024 | 5:53 PM

కేసీఆర్‌ను మించిపోయిన రేవంత్

17-09-2024 03:47:31 AM

  1. ప్రజా వ్యతిరేక పాలనలో మాజీ ముఖ్యమంత్రిని దాటిపోయారు 
  2. తెలంగాణ విమోచన దినోత్సవం జరిపే దమ్ము ప్రభుత్వానికి లేదు 
  3. మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ  

రంగారెడ్డి, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): ప్రజా వ్యతిరేక పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి.. మాజీ సీఎం కేసీఆర్‌ను మించిపోయారని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. సోమవారం షాద్‌నగర్ నియోజ కవర్గంలోని శ్రీ వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయంలో నిర్వహించిన గణపతి ఉత్సవంలో ఆమె పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రేవంత్ ప్రభుత్వ పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ నియంతలా పాలన సాగిస్తే ప్రజలు నిర్దాక్షిణ్యంగా గద్దె దించేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం సీఎం రేవంత్ పనితీరు కూడా అలాగే ఉందని, భవిష్యత్‌లో ఆయనకు కూడా అదే గతి పడుతుందని మండిపడ్డారు.

సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించే దమ్ము ఈ ప్రభుత్వానికి లేదన్నారు. రాష్ట్రంలో మైనార్టీల ఓటు బ్యాంకు కోసం రాజకీయ ఎత్తుగడలు వేస్తున్నారని, ప్రజలను మోసం చేయడం, అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ ప్రభుత్వం దిట్ట అని వ్యాఖ్యానించారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో యూట్యూబర్‌లను వాడుకొని గద్దెనెక్కి, ఇప్పుడు వారిని తక్కువ చేసి మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు.