calender_icon.png 20 November, 2024 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ స్పీచ్.. మహిళల్లో జోష్

20-11-2024 01:54:35 AM

  1. వరంగల్ ప్రజాపాలన విజయోత్సవ సభ సక్సెస్
  2. ఉమ్మడి జిల్లా నుంచి భారీగా తరలివచ్చిన మహిళలు
  3. సీఎం ప్రసంగానికి కరతాళ ధ్వనులతో మద్దతు 
  4. బీఆర్‌ఎస్ నేతలపై విమర్శతో నవ్వుల జల్లులు

జనగామ, నవంబర్ 19(విజయక్రాంతి): కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి విజయోత్సవ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మహిళలను ఉత్సాహపరిచేలా ప్రసంగించారు. ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, పేదలకు ఉచిత కరెంటు వంటివి మహిళల ఆర్థికాభివృద్ధి కోసమే ఇస్తున్నామని చెప్పారు.

ప్రసంగం ప్రారంభంలోనే తనకు పీసీసీ చైర్మన్ పదవి వచ్చినా, సీఎం పదవి వచ్చినా ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే అని చెప్పడంతో మహిళలు చప్పట్లతో హర్షం వ్యక్తంచేశారు. మహిళా స్కీములు, గ్రూపు సభ్యులకు ప్రభుత్వం కల్పించనున్న పథకాలను సీఎం వివరించారు.

అదే సమయంలో ప్రతిపక్షాలపై రేవంత్‌రెడ్డి తనదైన శైలీలో నిప్పులు చెరగడంతో సభా ప్రాంగణం హోరెత్తింది. కేసీఆర్‌పై విమర్శలు గుప్పించే క్రమంలో చప్పట్ల వర్షం కురిసింది. కేసీఆర్‌ను తాగుబోతుగా, హరీశ్‌రావు, కేటీఆర్‌ను బిల్లా రంగడుగా వర్ణిస్తూ సీఎం విమర్శలు చేయడంతో సభలో నవ్వుల జల్లు కురిసింది.

ఓరుగల్లులో అభివృద్ధి పండుగ

రూ.4,962 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన 

వరంగల్ మహా నగరంలో అభివృద్ధి పనుల జాతర నెలకొంది. సీఎం రేవంత్‌రెడ్డి నగర అభివృద్ధి కోసం రూ.4,962.47 కోట్లతో చేపట్టనున్న పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. రూ.4,170 కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రూ.205 కోట్లతో మామునూరు ఎయిర్‌పోర్టు భూసేకరణ, రూ.160.92 కోట్లతో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్, రూ.33.60 కోట్లతో టెక్స్‌టైల్ పార్కులో సదుపాయాలు, రూ.43.15 కోట్లతో టెక్స్‌టైల్ పార్కు భూబాధితులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, రూ.65 కోట్లతో పరకాల17ఎర్రగట్టు గుట్ట రోడ్డు విస్తరణ, రూ.8.3 కోట్లతో నయీంనగర్ బ్రిడ్జి నిర్మాణం, రూ.32.50 కోట్లతో వరంగల్ కార్పొరేషన్ బిల్డింగ్, రూ.80 కోట్లతో ఇన్నర్ రింగు రోడ్డు, రూ.28 కోట్లతో పాలిటెక్నిక్ కాలేజీ కొత్త బిల్డింగ్, రూ.49.50 కోట్లతో గ్రేటర్ వరంగల్ మునిసిపాలిటీ పరిధిలో రోడ్లు, రూ.కోటి 50 లక్షలతో వరంగల్ ఉర్దూ భవన్ నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు.