కరీంనగర్, జనవరి 6 (విజయక్రాంతి): రాష్ర్టం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ఖాజానాలో డబ్బులు లేవని, రేవంత్ రెడ్డి తమ్ముడికి చాలా చేయాలని ఉందని, కానీ ఆయన చేతులు కట్టేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. సోమవారం కరీంనగర్ లో సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం ప్రకటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికాక ముందు నన్ను అప్రో అయ్యాడు, ఒక సమ్మిట్ ఏర్పాటు చేసి వందల కోట్ల ఆదాయం తెలంగాణ వస్తుందని చెప్పాడు, కానీ ఢిల్లీ అధిష్టానం వినడం లేదని, నాకు అనుమతి ఇవ్వడం లేదు, పెద్దలతో మాట్లాడేందుకు నేను మంగళవారం ఢిల్లీ వెళ్తున్నానని చెప్పారు. 19 వేలకుపైగా ఉన్న సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయకపోతే దేశవ్యాప్తంగా కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు.
తెలంగాణలో బీజేపీ అసలే లేదని, ఆ పార్టీ చేసిందేమి లేదని, నా తమ్ముడు బండి సంజయ్ ఇక్కడ ఎంపీగా ఉన్నా ఏమి చేయలేదని, ఆయన పేరుకే కేంద్ర మంత్రి అని అన్నారు. సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ క్రిస్టియన్ అమ్మాయిని చేసుకున్నాడని, ఆమెను బాగా చూసుకోవాలని సలహా ఇచ్చారు. అవినీతి చేసినవారి మీద కేసులు పెట్టకుంటే భారతరత్న ఇస్తారా అంటూ కేటీఆర్, కేసీఆర్ విషయంలో మాట్లాడారు. చిరంజీవి పార్టీని కాంగ్రెస్లో కలిపినందుకే ఆయనకు పద్మభూషణ్ ఇచ్చారని ఎద్దేవా చేశారు.