- ఎక్స్ వేదికగా సీఎం రేవంత్‌కు బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ చురకలు
- తెలంగాణ చరిత్ర కేసీఆరేనని స్పష్టం
హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): ‘చిట్టినాయుడూ.. నువ్వా కేసీఆర్ పేరును తుడిచేది’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు మండిపడ్డారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బుధవారం కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. ‘నువ్వు చెప్పులు మోసిన నాడు.. ఆయన ఉద్యమానికి ఊపిరి పోశాడు.
నువ్వు పదవుల కోసం పరితపిస్తున్ననాడు.. ఆయన ఉన్న పదవిని తృణప్రాయంగా వదిలేశాడు. నువ్వు ఉద్యమకారుల మీద గన్ను ఎక్కు పెట్టిననాడు.. ఆయన ఉద్యమానికి తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు. పోరాడి సాధించుకున్న తెలంగాణను సంపేటందుకు బ్యాగు లు మోస్తున్ననాడు, ఆయన తెలంగాణ భవిష్యత్‌కు ఊపిరిపోసాడు’ అని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్ర కేసీఆరే అని స్పష్టంచేశారు.
మూసీపై ముందుకు.. కొనుగోళ్లపై వెనక్కు
‘మూసీపై ముందుకు.. కొనుగోళ్లపై వెనక్కు’, రామన్నపేటకు రైరై.. కొనుగోలు సెంటర్లకు నైనై, దామగుండం ధనాధన్-ధాన్యం కొనుగోళ్లు డాం డాం, కొనుగోళ్లకు దిక్కులేదు-కాంగ్రెస్ కోతలకు లెక్కలేదు. దళారులకు దండిగా-రైతన్నలకు దండగా.
నాడు క్వింటాలుకు రూ.2300 అమ్ముకున్న రైతు మీ పుణ్యమా అని నేడు రూ.1800 లకు అమ్ముకోబట్టే’ అని కాంగ్రెస్ తీరుపై కేటీఆర్ విమర్శనాస్త్రాలు వదిలారు. ఎద్దేడ్చిన వ్యవసాయం రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పుడు బాగుపడదని సీఎం రేవంత్‌రెడ్డికి హితవు పలికారు.
రేవంత్ రెడ్డికి భయపడేది లేదు
రేవంత్‌రెడ్డి లాంటి వ్యక్తులకు భయపడేది లేదని -కేటీఆర్ స్పష్టంచేశారు. కాంగ్రెస్ హామీలపై ప్రశ్నించిన వ్యక్తిని మహబూబ్‌నగర్‌లో సీఐ కొట్టిన ఘటనపై బుధవారం ఆయన సీరియస్ అయ్యారు. బాధితుడికి ఫోన్ చేసి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.
ప్రశ్నించే వ్యక్తులను కొట్టే హక్కు పోలీసులకు లేదని అన్నారు. దాడికి పాల్పడిన సీఐపై న్యాయపరంగా పోరాటం చేయటంతోపాటు బీసీ కమిషన్, హ్యుమన్ రైట్స్ కమిషన్‌కు కూడా వెళ్తామని స్పష్టంచేశారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరించవద్దని సూచించారు. మళ్లీ బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికీ మిత్తితో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.