09-03-2025 08:02:04 PM
33 కోట్ల నేతన్నల వ్యక్తిగత రుణమాఫీ...
మందమర్రి (విజయక్రాంతి): నేతన్నలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వ్యక్తిగత రుణమాఫీని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాకారం చేస్తూ, 33 కోట్ల వ్యక్తిగత రుణాన్ని మాఫీ చేశారు. అఖిలభారత, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం మహాసభ ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నిర్వహించగా, ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేతన్నలు చేనేత రుణమాఫీ చేయాలని అభ్యర్థించారు. స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభ నుండి వెళ్లిన వెంటనే ప్రత్యేక చొరవతో జీఓ నెంబర్ 56 ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా 33 కోట్ల నేతన్నల వ్యక్తిగత రుణమాఫీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రికి, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మినరల్ కార్పొరేషన్ చైర్మన్ ఇరావత్రి అనిల్, పద్మశాలి సంఘం నేతలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఫిబ్రవరి 1, 2017 నుండి మార్చి 31, 2024 లోపు లక్ష రూపాయలు లోపు తీసుకున్న వ్యక్తిగత రుణాలు మాఫీ చేసినట్లు సంఘం నేతలు వివరించారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత పద్మశాలి సంఘం జాతీయ అధ్యక్షుడు కందగట్ల స్వామి, ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్థపు మురళి, అఖిలభారత పద్మశాలి సంఘం యువజన విభాగం జాతీయ ఇంచార్జ్ అవ్వారి భాస్కర్, పద్మశాలి సంఘం యువజన నాయకుడు పిట్టల సుధాకర్ లు పాల్గొన్నారు.