calender_icon.png 3 December, 2024 | 11:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్‌రెడ్డి విప్లవ నాయకుడు

14-10-2024 04:08:12 AM

ప్రతిపక్షాల పాఠాలు అవసరం లేదు

ఎంపీ మల్లు రవి

హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): తమిళనాడులో కరుణానిధి, జయలలిత మాదిరిగా తెలంగాణలో రేవంత్ రెడ్డి విప్లవ నాయకుడని ఎంపీ మల్లు రవి అన్నారు. హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టే లక్ష్యంతో రాత్రి, పగలు అనే తేడా లేకుండా సీఎం రేవంత్ రెడ్డి కష్టపడుతున్నారని ఆయన అన్నారు.

ఆదివారం గాంధీ భవన్‌లో మీడియా సమావేశంలో ఎంపీ మల్లు రవి మాట్లాడారు. మూసీ విషయంలో ప్రతిపక్షాల దగ్గర పాఠాలు నేర్చకోవాల్సిన అవసరం తమకు లేదని తేల్చి చెప్పారు. గత సర్కారు రూ.7 లక్షల కోట్లు ఎందుకు అప్పు తెచ్చిందో బీఆర్‌ఎస్ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు.

ఒకవైపు రేవంత్ రెడ్డి రాజ్యాంగ విలువలను కాపాడుతుంటే మరోవైపు బీజేపీ, బీఆర్‌ఎస్ రాజ్యాంగ హక్కులను కాలరాయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. మూసీ ప్రక్షాలన వల్ల తాత్కాలిక ఇబ్బందులు వచ్చినా భవిష్యత్‌లో హైదరాబాద్‌కు మంచి జరుగుతుందని చెప్పారు. బీఆర్‌ఎస్ సర్కారు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు.  కేసీఆర్ పాలనలో దాదాపు 5వేల స్కూళ్లను మూసేశారని దుయ్యబట్టారు.

ప్రపంచస్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం గురుకులాలను నిర్మించనుందని తెలిపారు. ఒక్కో స్కూల్‌ను రూ.150 కోట్లతో నిర్మించబోతోందని, మొత్తం రూ.2,500కోట్లను ఖర్చు చేయబోతోందన్నారు. యంగ్ ఇండియా గురుకులాలతో సమాజంలో సమూలమైన మార్పు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. గత పాలకుల సౌకర్యాల కోసం ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేశారని ఆరోపించారు. 

కాంగ్రెస్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం

యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్  స్కూల్స్ నిర్మించేందుకు కాంగ్రెస్ సర్కారు చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ అన్నారు. పదేళ్లో పాలనలో రెసిడెన్సియల్ స్కూల్స్‌ను  బీఆర్‌ఎస్ మురికి కూపాలుగా మార్చిందని, కాంగ్రెస్ సర్కారు వాటిని తొమ్మిది నెలల పాలనలోనే కడిగేసిందన్నారు.

గత పాలనలో కేజీ టూ పీజీ ఉచిత విద్య అందిస్తున్నామని చెప్పిన బీఆర్‌ఎస్ ప్రజల చెవిలో పూలు పెట్టిందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిని విద్యను బడుగు, బలహీన వర్గాలకు అందించాలన్న లక్ష్యంతోనే సీఎం రేవంత్ రెడ్డి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ పాఠశాలలను నిర్మించబోతున్నారని బీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీకాంత్ గౌడ్ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో రాష్ట్రంలో ఆటవిక పాలన జరిగిందన్నారు.