హైదరాబాద్: చర్లపల్లి టెర్మినల్ వర్చువల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. భారతదేశ అభివృద్ధికి రైల్వేల అభివృద్ధి చాలా కీలకమని సూచించారు. తెలంగాణ లాంటి రాష్ట్రాల అభివృద్ధి కూడా రైల్వేల అభివృద్ధిపైనే ఆధారపడి ఉందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని చర్లపల్లిలో కొత్త టెర్మినల్, స్టేషన్‌ను పూర్తి చేసినందుకు కేంద్రానికి రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఒక ట్రిలియన్ డాలర్ జిడిపి ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలని తాము సంకల్పించామని సీఎం స్పష్టం చేశారు.
భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. హైదరాబాద్ నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే, డైరెక్ట్ రైల్వే నిర్మాణానికి కేంద్రం సహకరించాలని కోరారు. తెలంగాణలో 370 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్(Regional Ring Road) ను నిర్మించబోతున్నామన్న రేవంత్ రెడ్డి రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైల్ నిర్మాణంలో కేంద్రం పూర్తిగా సహకరించాలని కోరారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2కు ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించామని వెల్లడించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫెజ్-2(Hyderabad Metro Rail Phase-II) కు పూర్తి సహకారం అందించాలని కేంద్రాన్ని కోరారు. వికారాబాద్ నుంచి కృష్ణా రైలు మార్గాన్ని, కల్వకుర్తి నుంచి మాచర్ల మధ్య కొత్త రైల్వే లైన్లు, డోర్నకల్ నుంచి రెండు లైన్లు ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కోరారు.