* హాజరుకానున్న చంద్రబాబు, దేవేంద్ర ఫడ్నవీస్
న్యూఢిల్లీ, డిసెంబర్ 22: స్విట్జర్లాండ్‌లోని దావోస్ కేంద్రంగా వచ్చే ఏడాది జనవరి 20 నుంచి వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సహా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ హాజరు కానున్నారు. ఈ మేరకు పీటీఐ వార్తా సంస్థ తాజాగా తన కథనంలో పేర్కొంది. దేశ నలుమూల నుంచి పలు సంస్థలకు చెందిన 100పైగా సీఈఓలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నట్టు తెలిపింది. పలువరు కేంద్ర మంత్రులు కూడా ఈ సమావేశాలకు హాజరవుతున్నట్టు పేర్కొంది.
అయితే ఆ కేంద్ర మంత్రులకు సంబంధించిన పేర్లను మాత్రం వెల్లడించలేదు. గతంలో జరిగిన సమావేశాల్లో ప్రధాని నరేంద్రమోదీ సైతం పాల్గొన్నట్టు గుర్తు చేసిన వార్తా సంస్థ.. జనవరిలో జరగబోయే సమావేశంలో పాల్గొనడంపై స్పష్టత ఇవ్వలేదు. డబ్ల్యూఈఎఫ్ అంతర్జాతీయంగా పబ్లిక్, ప్రైవేట్ పరస్పర సహకారం కోసం పని చేస్తోంది. కాగా ఈ సారి ‘ఇంటెలిజెంట్ ఏజ్ కోసం సహకారం’ అనే థీమ్‌తో డబ్ల్యూఈఎఫ్ సదస్సు జరగనున్నట్టు పీటీఐ స్పష్టం చేసింది.