calender_icon.png 5 March, 2025 | 2:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక వ్యక్తి కోసమో, ఒక కుటుంబం కోసమో తెలంగాణ తెచ్చుకోలేదు

09-12-2024 07:45:53 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో 20 అడుగుల తెలంగాణ తల్లి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ రోజు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. భూమి ఎక్కడైనా మన అస్తిత్వానికి ప్రతీక తల్లి అని, తెలంగాణ చరిత్ర, సంస్కృతి ఎన్నో ఏళ్లు అవహేళనకు గురైందని  సీఎం చెప్పారు. ఉద్యమం ఉవ్వెత్తున ఉన్న రోజుల్లో అందరం బండ్ల మీద, కార్యాలయాల మీద టీజీ అని రాసుకున్నాం. కానీ, గత ప్రభుత్వం మాత్రం టీజీ అక్షరాలు కాదని టీఎస్ అని పెట్టిందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా టీఎస్ ను టీజీగా మార్చాం రేవంత్ రెడ్డి తెలిపారు.

ఉద్యమం రోజుల్లో ఎక్కడ విన్నా.. జయ జయహే తెలంగాణ వినిపించేదని, రాష్ట్రం ఏర్పాడిన తర్వాత జయ జయహే తెలంగాణ పాటకు గౌరవం దక్కలేదని మండిపడ్డారు. అందుకే తాము జయ జయహే తెలంగాణ రాష్ట్రగీతంగా ప్రకటించామని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పదేళ్లపాటు తెలంగాణ తల్లి వివక్షతకు గురైన రాష్ట్రాన్ని సంక్షోభం నుంచి సంక్షేమం వైపు నడిపిస్తున్నామన్నారు.ఎందరో కవులు, కళాకారులు ఉద్యమానికి వెన్నెముకగా నిలిచి, తమ పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతలూగించారని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేసుకున్నారు. అమరవీరుల స్థూపం రూపశిల్పి ఎక్కా యాదగిరిని రేవంత్ రెడ్డి సన్మానించి, ఆయనకు 300 గజాల స్థలం, రూ.కోటి నగదు ఇస్తామని హామీ ఇచ్చారు. ఒక వ్యక్తి కోసమో, ఒక కుటుంబం కోసమో తెలంగాణ తెచ్చుకోలేదని, 4 కోట్ల ప్రజల కోసం తెలంగాణ సాధించుకున్నామని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ దినం నిర్వహిస్తామన్నారు.