31-03-2025 06:53:04 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (Hyderabad Cricket Association) ఫ్రాంచైజీ - సన్‌రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మధ్య కొనసాగుతున్న వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్సీఏపై వస్తున్న ఆరోపణలపై విజిలెన్స్ విచారణ జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మ్యాచ్‌లకు ఐపీఎల్ టికెట్లు, అదనపు కాంప్లిమెంటరీ పాస్‌లు డిమాండ్ చేస్తూ హెచ్సీఏ ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని వేధిస్తున్నదని, బ్లాక్‌మెయిల్ చేస్తోందని ఐపీఎల్ ఛాంపియన్‌లు ఆరోపించారు. దీంతో తెలంగాణ సీఎంవో కార్యాలయం ఆరోపణలకు సంబంధించిన వివరాలను సేకరించిందని, ఎస్ఆర్హెచ్ నిర్వహణకు వచ్చిన బెదిరింపులపై విజిలెన్స్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ముఖ్యమంత్రి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ డైరెక్టర్ జనరల్ కె. శ్రీనివాస్ రెడ్డిని దర్యాప్తు నిర్వహించి పూర్తి నివేదికను సమర్పించాలని ఆదేశించారు. క్రికెట్ మ్యాచ్‌లకు పాస్‌లు డిమాండ్ చేస్తూ ఎస్ఆర్హెచ్ నిర్వహణకు ఎవరైనా సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.