హైదరాబాద్: సింగపూర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఆ దేశ పర్యావరణ శాఖ మంత్రి గ్రేస్ ఫూ హైయిన్(Singapore Minister Grace Fu Hai Yien)తో సమావేశమయ్యారు. తెలంగాణలో ఉన్న అపార పెట్టుబడి అవకాశాలు, భాగస్వామ్యాలపై ఈ సమావేశంలో ఇరుపక్షాల మధ్య విస్తృత చర్చలు జరిగాయి. ముఖ్యంగా పట్టణాభివృద్ధి ప్రణాళిలు, మౌలిక సదుపాయాల కల్పన, నీటి వనరులు- నిర్వహణ, నైపుణ్యాల అభివృద్ధి, క్రీడలు, సెమీ కండక్టర్లు, తయారీ, పర్యావరణం, స్థిరత్వ, సాంకేతికత సహా వివిధ రంగాలలో తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, భాగస్వామ్యాలపై చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయి.
ఈ చర్చల్లో ముఖ్యమంత్రి వెంట ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu), రాష్ట్రానికి చెందిన ఉన్నతాధికారులు, సింగపూర్‌లో భారత డిప్యూటీ హై కమిషనర్ పూజ ఎం.టిల్లు పాల్గొన్నారు. తెలంగాణ రైజింగ్(Telangana Rising) లక్ష్యాలు, ఆ మేరకు ప్రజా ప్రభుత్వం అనురిస్తున్న కార్యాచరణ పట్ల సింగపూర్ మంత్రి గ్రేస్ ఫూ హైయిన్ ఆసక్తి కనబరిచారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రధానంగా నెట్ జీరో ఫ్యూచర్ సిటీ(Net Zero Future City), మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్, నీటి నిర్వహణ, స్థిరత్వ ప్రణాళికల్లో తెలంగాణతో భాగస్వామ్యం అంశాన్ని సింగపూర్ ప్రభుత్వం పరిశీలిస్తుందని వారు హామీ ఇచ్చారు. ఉమ్మడి ప్రాజెక్టులపై సాధ్యమైనంత వేగంగా ముందుకు పోవాలని, మరింత సమన్వయంతో పని కలిసి చేయాలని ఇరుపక్షాలు అంగీకరించాయి.
సింగపూర్‌లో పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని "తెలంగాణ రైజింగ్" అధికార ప్రతినిధి బృందం తన విదేశీ పర్యటనను ప్రారంభించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ITE) అధికారులతో సమావేశం నిర్వహించింది. ముఖ్యమంత్రి వెంట ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ వీసీ ఉన్నారు.