04-04-2025 12:00:00 AM
ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి
చేవెళ్ల, ఏప్రిల్ 3 (విజయక్రాంతి):సీఎం రేవంత్ రెడ్డి తనను టార్గెట్ చేస్తున్నారని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆరోపించారు. సీఎం అయిన కొత్తలోనే తన మాల్ కూల్చివేయించడంతో పాటు టంగటూరు భూమి విషయంలో సామ దామోదర్ రెడ్డితో తప్పుడు కేసులు పెట్టించాడని, ఇది ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు.
సుప్రీం కోర్డు ఆదేశాల మేరకు విచారణలో భాగంగా గురువారం మరోసారి మోకిలా పోలీస్ స్టేషన్ కు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... సుప్రీం కోర్డు తనను అరెస్ట్ చేయవద్దని ఆర్డర్ ఇచ్చిందని, పోలీసుల విచారణకు సహకరించాలని చెప్పడంతో మళ్లీ పీఎస్ వచ్చి 114 ఎకరాల కు సంబంధించి సేల్ డీడ్స్ సబ్మిట్ చేశానని చెప్పారు.
కానీ పోలీసులు సతాయిస్తున్నారని, మొన్న 4 గంటల పాటు, ఈ రోజు 3 గంటల పాటు విచారించారని, తామేం టెర్రరిస్టులం కామన్నారు. కోర్డు ఆర్డర్ ఉండగా తనపై కేసు పెట్టిన వారితో సెటిల్ చేసుకోవాలని చెబుతున్నారని ఇదేం పద్దతని ప్రశ్నించారు. ఏసీపీ, డీసీపీ, సీఐకి తామేం చెప్పాలని నిలదీశారు. డీసీపీ శ్రీనివాస్ మూడు రోజుల నుంచి ఫోన్ ఎత్తట్లేదని, ఆయనకు ఏం ఇంట్రెస్ట్ ఉందో అర్థం కావడం లేదన్నారు.
114 ఎకరాలు లీగల్‌గా కొన్నా
సామ దామోదర్ రెడ్డి ఓ చీటర్.. ల్యాండ్ గ్రాబర్ అని, రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో అతనిపై ఎన్నో కేసులు ఉన్నాయని ఆరోపించారు. 2016లో రాంచందర్ రెడ్డి, రత్నాకర్ రెడ్డి, నీరజా రెడ్డి, చైతన్య దగ్గర ల్యాండ్ కొన్నామని చకెప్పారు. శంకర్ పల్లిలో మొత్తం పేమెంట్ చేసి 114 ఎకరాలకు సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకున్నామని స్పష్టం చేశారు.
10 ఏళ్ల పాటు ఎలాంటి కేసులు పెట్టని సామ దామోదర్ రెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే తనతో పాటు తన భార్య, 70 ఏండ్ల తన తల్లిపై కేసు పెట్టారని మండిపడ్డారు. తాము హైకోర్టు వెళ్లగా తన తల్లి, భార్యకు బెయిల్ వచ్చిందని దాన్ని కూడా పోలీసులకు ఇచ్చామన్నారు.
వాళ్లు తమపై ఫాల్స్ అలిగేషన్స్ చేస్తున్నారని, చేవెళ్ల, ఎల్ బీ నగర్ కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయని.. వాళ్ల దగ్గర ఏమన్నా డాక్యుమెంట్స్ ఉంటే కోర్టులో సబ్మిట్ చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఆ ల్యాండ్ పై 145 సీఆర్పీసీ ప్రొసీడింగ్స్ ఉన్నాయని, ఆ భూమి చేవెళ్ల, పోలీస్, రెవెన్యూ జూడిక్షన్, ఆర్డీవో కంట్రోల్ ఉందని చెప్పారు.