* చంద్రబాబుఆస్తి 931 కోట్లు
* దేశంలోనే రిచెస్ట్ సీఎంగా రికార్డు
* పేద ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
న్యూఢిల్లీ, డిసెంబర్ 31: దేశంలోనే అత్యంత సంపన్న సీఎంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిలిచారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) అనే సంస్థ తెలిపింది. పేద సీఎంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నిలిచారు.
గత ఎన్నికల సందర్భంగా ఈసీకి అభ్యర్థులు సమర్పించిన అఫిడవిట్లు, నామినేషన్ పేపర్లలోని సమాచారం ఆధారంగా ఈ అంచనాకు వచ్చినట్లు ఏడీఆర్ తెలిపింది. చంద్రబాబు నికర ఆస్తుల విలువ దాదాపు రూ. 931 కోట్లకు పైగా ఉంది. ఆయనకు రూ. 10 కోట్ల దాకా అప్పులు ఉన్నాయని సంస్థ పేర్కొన్నది.
చంద్రబాబు దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం ఆయన పేరిట రూ.36 కోట్ల ఆస్తి ఉండగా, ఆయన సతీమణి భువనేశ్వరి పేరిట రూ.895 కోట్లు ఆస్తులు ఉన్నాయి. సంపన్న ముఖ్యమంత్రుల్లో అరుణాల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ రూ.332 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు.
కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు రూ. 51 కోట్ల నికర ఆస్తులు ఉన్నాయి. ఆయనకు రూ.23 కోట్ల అప్పులు ఉన్నట్లు సంస్థ పేర్కొన్నది. దాదాపు 10 రాష్ట్రాల సీఎంలకు రూ. కోటికి పైగానే అప్పులు ఉన్నట్లు అఫిడవిట్‌లో ప్రస్తావించారని తెలిపింది.
పేద సీఎంగా మమత..
అతి తక్కువ ఆస్తులు కలిగిన సీఎంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత నిలిచారు. ఆమె ఆస్తుల విలువ రూ. 15.38 లక్షలే. మమత పేరిట స్థిరాస్తులు లేవని తెలి పింది. జమ్ముసీఎం ఒమర్ అబ్దుల్లా రూ. 55 లక్షలకు పైనే ఆస్తులతో తక్కువ ఆస్తులు ఉన్న జాబితాలో రెండో స్థానంలో నిలిచారు. కేరళ సీఎం విజయన్‌కు దాదాపు రూ.1.18 కోట్లు ఆస్తులు ఉన్నాయి.
సీఎంల సగటు ఆస్తి..
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంల సగటు ఆస్తి రూ. 52.59 కోట్లుగా ఉంది. ముఖ్యమంత్రుల సగటు ఆదాయం ఏడాదికి రూ.13,64,310గా ఉంది. 31 మంది సీఎంల మొత్తం ఆస్తి రూ.1,630 కోట్లుగా ఉన్నట్లు ఏడీఆర్ పేర్కొన్నది.
రేవంత్‌రెడ్డిపై అత్యధిక కేసులు..
దేశంలో అత్యధిక కేసులు ఉన్న సీఎంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నిలిచారు. 31 మంది సీఎంలలో రేవంత్‌పైనే అధిక కేసులు ఉన్నట్లు ఏడీఆర్ తెలిపింది. ఆయనపై మొత్తం 89 కేసులు ఉన్నాయి. వీటిలో 72 కేసులు తీవ్రమైనవని పేర్కొన్నది. 13 మంది ముఖ్యమంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ప్రకటించింది. రేవంత్‌రెడ్డి తరువాత 47 కేసులతో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ రెండో స్థానంలో ఉన్నారు.