గన్నారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఎంపీ అరవింద్
- హామీలు నెరవేర్చకుండా విజయోత్సవాలా?
- ఎంపీ ధర్మపురి అరవింద్
కామారెడ్డి, నవంబర్ 13 (విజయక్రాంతి) : సీఎం రేవంత్‌రెడ్డి తన గురువైన చంద్రబాబును చూసి పనిచేస్తాడనుకుంటే.. కేసిఆర్ శిష్యుడిలా వ్యవహరిస్తున్నాడని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు. నిజామాబాద్ జిల్లా ఇందల్‌వాయి మండలం గన్నారంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యానారాయణతో కలిసి బుధవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్వింటాకు రూ.500 బోనస్, ఎకరాకు రూ.7,500 రైతు భరోసా ఇస్తానన్న సీఎం.. అవి ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. రైతులు బీఆర్‌ఎస్ హయాంలో పడిన ఇబ్బందులే ఇప్పుడూ పడుతున్నారని విమర్శించారు. రేవంత్, కేటీఆర్ పరస్పర ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్రంలో డగ్స్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
రైతులకు ఇచ్చిన హామీలు పూర్తిస్థాయిలో నేరవేర్చకుండా ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకోవడం విడ్డురంగా ఉందన్నారు. రైతులకు పూర్తిస్థాయిలో రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు కేంద్రాలకు రైతులు ధాన్యం తీసుకొస్తే ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు.
సిఎం రేవంత్, కేసీఆర్ బాటలో నడిస్తే ఆయనకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. అనంతరం నిజామాబాద్‌లో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఏబీవీపీ నాయకుడిని ఆయన పరామర్శించారు. కార్యక్రమంలో బిజేపి జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి, నాయకులు పల్లె గంగారెడ్డి, అనిత, రైతులు తదితరులు పాల్గొన్నారు.