calender_icon.png 2 November, 2024 | 5:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్.. కేటీఆర్ చేయాల్సింది మోకాళ్ల యాత్ర

02-11-2024 02:42:41 AM

  1. ప్రజల వద్దకు పాదయాత్రలు కాదు.. 
  2. మోదీపై కాంగ్రెస్ యుద్ధం దేనికోసమో చెప్పాలి..?
  3. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్

కరీంనగర్, నవంబర్ 1 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేయాల్సింది పాదయాత్రలు కాదని, తప్పుందని ప్రజల వద్దకు మోకాళ్ల యాత్ర చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు.

బెజ్జంకి, ఇల్లంతకుంట మండలాల్లో శుక్రవారం ఆయన పర్యటించి మీడియాతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ పాలనలో తాను పాదయాత్ర చేస్తే నాటి సీఎం కేసీఆర్ తనపై దాడి చేయించారన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆరు గ్యారంటీల అమలుపై పాదయాత్ర చేయాలని సవాల్ విసిరారు. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోదీపై కాంగ్రెస్ ఎందుకు యుద్ధం చేస్తుందో ప్రజలకు చెప్పాలని సూచించారు.

కేంద్రంలో మోదీ ప్రభుత్వాన్ని గద్దెదించి ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీని ప్రధానిని చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తున్నదని ఆరోపించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసి డ్రామాలాడుతున్నాయని ఆయన అన్నారు.

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతి, అక్రమాలు, అరాచకాల నిగ్గు తేల్చి, వారందరినీ కారాగారినికి పంపుతామని బీరాలు పలికిన కాంగ్రెస్ ఇప్పుడెందుకు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్, ధరణి, గొర్రెల స్కీం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్.. ఇలా  ఎన్నో విషయాల్లో బీఆర్‌ఎస్ నేతలు అరెస్ట్ కావాల్సి ఉందన్నారు.

కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనిని అడ్డుకుంటున్నదన్నారు. హిందువుల ఓట్లు తమ పార్టీకి అవసరం లేదని కాంగ్రెస్ పార్టీకి చెప్పే దమ్ముందా? అని సవాల్ విసిరారు. ఆరు నెలలుగా ఫాంహౌస్‌కు పరిమితమైన కేసీఆర్ కుటుంబానికి ఆపద వస్తే, కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబాన్ని కాపాడుతున్నదని ఆరోపించారు.