calender_icon.png 29 September, 2024 | 9:54 AM

రేవంత్ గనులశాఖలో అవినీతి ఘనులు

29-09-2024 01:09:30 AM

 బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): నకిలీ పత్రాలు సృష్టించి తెలంగాణ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ నుంచి రూ.150 కోట్ల విలువజేసే 1.50 లక్షల టన్నుల ఇసుకను కాంగ్రెస్ నేతలు దోచేశారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. శనివారం ఆయన ఎక్స్‌వేదిక స్పందిస్తూ హైదరాబాద్ మెట్రో వాటర్ పనుల పేరిట తప్పుడు కాగితాలు సృష్టించి ఇసుకను దారి మళ్లించింది ఇంటి దొంగలేనన్నారు.

సీఎం రేవంత్‌రెడ్డి శాఖలోనే జరిగిన ఈ కుంభకోణం, ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా జరగదన్నారు.  హైడ్రా బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌కు వస్తున్న బాధితులకు భరోసా కల్పించాలని పార్టీ నేతలకు, శ్రేణులకు సూచించారు.

మూసీ రివర్ ఫ్రంట్ పేరిట బ్యాక్ డోర్‌లో జరుగుతున్న ప్రభుత్వ భాగోతాన్ని తెలంగాణ సమాజం గమనిస్తోందని కేటీఆర్ హెచ్చరించారు. కుంభకోణాల కాంగ్రెస్‌కు కర్రుగాల్చి వాతపెడతామన్నారు. మూసీ సుందరీకరణకు మొన్నటివరకు రూ.50 వేల కోట్లు ఖర్చవుతుందని చెప్పిన ప్రభుత్వం, ఇప్పుడు రూ.లక్షా 50 వేల కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచేసిందన్నారు.

తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రూ.80 వేల కోట్లు ఖర్చు చేస్తే గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ గగ్గోలు పెట్టిందని, మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులెందరో.. నిల్వ చేసే టీఎంసీలు ఎన్నో లెక్క చెప్పాలన్నారు.