calender_icon.png 19 October, 2024 | 5:06 AM

రేవంత్.. చర్చకు నేను రెడీ!

19-10-2024 02:35:06 AM

  1. సీఎం రేవంత్‌కు దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా రావాలి
  2. తేదీ, సమయం చెప్పండి.. లేకుంటే నేను చెప్పిన టైమ్‌కి రండి
  3. మాజీమంత్రి హరీశ్‌రావు సవాల్

హైదరాబాద్, అక్టోబర్ 18(విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా మూసీ నిర్వాసితుల వద్దకు రావాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. సమయం, తేదీ మీరే చెప్పాలని, లేకుంటే శనివారం ఉదయం 9 గంటలకు తాను సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు.

శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి మాట్లాడుతూ ముందు మూసీ బాధితుల వద్దకు వెళ్లిన తర్వాత మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ ప్రాజెక్టుల వద్దకు వెళ్లి అక్కడే కూర్చొని మాట్లాడుకుందామన్నారు. 

ముఖ్యమంత్రి హోదాలో సిగ్గులేకుండా మాట్లాడుతున్నావని, 2013 చట్టానికి మించిన ప్రయోజనాలు మల్లన్నసాగర్ ద్వారా ప్రజలకు బీఆర్‌ఎస్ ఇచ్చిదేనన్న సంగతి మరిచిపోవద్దన్నారు. ఆశాలు, అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించిన చరిత్ర కాంగ్రెస్, అంతకు ముందు ఆయన గెలిచిన టీడీపీకి ఉందని విమర్శించారు.

అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామన్న హామీలను అటకెక్కించి, ప్రతిపక్షాలపై దిగజారుడు రాజకీయాలకు ఒడిగట్టారన్నారు. ఆయన్ను చూస్తే చిన్నపిల్లలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మూసీ పునర్జీవనం చేయాలంటే ముందు నదిలోకి వ్యర్థాలు రాకుండా అరికట్టాలని సూచించారు.

మూసీ సుందరీకరణ పేరుతో వేలకోట్లు కొల్లగొట్టే కుట్ర జరుగుతోందని, నగరంలో పరిశ్రమలను ఫార్మాసిటీకి తరలించి అక్కడ నగరంలో వచ్చే వ్యర్థాలను తగ్గించవచ్చన్నారు. కేసీఆర్ ఫార్మాసిటీ కోసం సేకరించిన 13 వేల ఎకరాల భూమిని రియల్ ఎస్టేట్ వెంచర్ చేసి ఆటలాడుతున్నారని మండిపడ్డారు. ఫార్మాసిటీ వస్తే నగరంలో కాలుష్యం తగ్గడంతో పాటు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు.

మూసీ ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు అని బహిరంగంగా ప్రకటించిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఆ మాట ఎవరన్నారంటూ మాటమార్చడం విడ్డూరంగా ఉందని, మెగాస్టార్లు, సూపర్‌స్టార్లు కూడా రేవంత్ నటనను చూసి ఆశ్చర్యపోతారన్నారు.

మూసీ గర్భంలో ఉన్నరి ఇళ్లు కూలగొట్టి, నష్టపరిహారం ఇవ్వకుండా అన్యాయం చేశారని, కేసీఆర్ ప్రభుత్వం మాత్రం రూ.2 వేల కోట్లతో మల్లన్నసాగర్ నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించిందన్నారు. నది గర్భంలో ఉన్న వారికి కూడా 2013 చట్టం అమలు చేయాలన్నారు. డీపీఆర్, పర్యావరణ క్లియరెన్స్ లేకుండా, అబ్జెక్షన్ కాల్ పర్ చేయకుండా ఏ విధంగా ఇళ్లను కూలుస్తారని ప్రశ్నించారు.

ప్రభుత్వం  అనుమతులిచ్చిన తర్వాతే వారు ఇళ్లు నిర్మించుకున్నారన్న విషయాన్ని మరిచిపోరాదన్నారు. తాను మూసీ సుందరీకరణ, పునరుజ్జీవనానికి వ్యతిరేకం కాదని, రియల్ ఎస్టేట్ దందాకు, బుల్డోజర్ రాజకీయాలకు వ్యతిరేకమన్నారు. కాంగ్రెస్ దుర్మాగ పాలనను ప్రజల్లో ఎండగడతామన్నారు.