- సోనియా మొదలు మహిళలపై నోటిదురుసు ప్రదర్శించారు
- భావోద్వేగానికి గురైన సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్, జూలై 31 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డికి మహిళలంటే గౌరవం లేదని.. సోనియా గాంధీ నుంచి ఇప్పుడు తన వరకూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శాసన సభలో ఏం జరిగిందో ప్రజలందరూ చూశారని చెప్పారు. శాసన సభలో కేటీఆర్ ప్రతి అం శాన్ని కూలంకషంగా వివరించే ప్రయత్నం చేశారని, కేటీఆర్ ప్రసంగం నుంచి దృష్టి మళ్లించేందుకు రేవంత్‌రెడ్డి ఇలాంటి వ్యాఖ్య లు చేశారని ఆరోపించారు.
బుధవారం అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా మీడియా పాయింట్ వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. ‘మీ వెనకున్న అక్కలే మమ్మల్ని ముంచారని, మిమ్మల్ని కూడా ముంచుతారు’ అని కేటీఆర్‌తో సీఎం వ్యాఖ్యానిం చారని అన్నారు. అక్కలను నమ్ముకుంటే ముంచుతారని, జూబ్లీ బస్టాండ్ అవుతుందని సీఎం అసెంబ్లీలో వ్యాఖ్యానించారని మండిపడ్డారు. రేవంత్ కాంగ్రెస్‌లోకి రాకముందే కాంగ్రెస్‌కు తాము సేవలందించామని గుర్తుచేశారు. భుజాన జెండా వేసుకుని కాంగ్రెస్ కోసం కష్టపడ్డామని, కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తాను, సునీత కోరు కున్నట్టు స్పష్టం చేశారు. తాను, సునీత పార్టీ ని మోసం చేశామని రేవంత్‌రెడ్డి మాట్లాడారని.. రేవంత్‌ను కాంగ్రెస్‌లోకి రావాలని కోరడమే తాను చేసిన తప్పని ఆమె అన్నారు.
ఆడబిడ్డలు క్షేమం కోరుకుంటారు, నమ్మిన వారికి ప్రాణం ఇస్తారని స్పష్టంచేశారు. ఇవాళ జరిగిన అవమానం సునీత, సబితకు మాత్రమే కాదని.. సభలో జరిగిన దానిపై ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఆలోచిస్తున్నారని చెప్పారు. 24 ఏళ్ల నుంచి తాను అసెంబ్లీకి వస్తున్నానని, సీఎం పీఠంపై చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్‌ను చూశానని అన్నారు. ఈ రోజు సీఎం పీఠంపై రేవంత్‌రెడ్డిని కూడా చూస్తున్నానని, నిండు సభలో మహిళలపై మాట్లాడి సీఎం పీఠాన్నే రేవంత్ అగౌరవపరిచారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సబిత తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
మహిళలను అవమానపర్చేలా మాటలు : సునీతా లక్ష్మారెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాటలు మహిళలను గాయపరుస్తున్నాయని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మండిపడ్డారు. మహిళా ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకు రాష్ర్ట మహిళలందరికీ సీఎం, డిప్యూటీ సీఎం క్షమా పణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తాము పార్టీ మారారని అంటున్నవాళ్లు ఏ పార్టీ నుంచి వచ్చారో ఆలోచించుకోవాలని హితవుపలికారు. తనను, సబిత, డీకేఅరుణను పార్టీ నుంచి పంపించింది మీరు కాదా? అని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. నిండు సభలో ఆ రోజు ద్రౌపదికి అవమానం జరిగిందని, ఈ సభలో మాతో పాటు మహిళలందరిని అవమానపరిచినట్టు భావిస్తున్నామని అన్నారు. కాంగ్రెస్‌లో మహిళలకు గౌరవం లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీని తాము మోసం చేశామని మంత్రి సీతక్క అంటున్నారని.. ఆమె ఏ పార్టీ నుంచి వచ్చారని సునీతాలక్ష్మారెడ్డి ప్రశ్నించారు.
మహిళలపై సీఎం వ్యాఖ్యలు సరి కాదు : కేటీఆర్
మహిళలపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. మహిళలను నమ్ముకుంటే బతుకు బస్టాండ్ అవుతుందని సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడటం శోచనీయమన్నారు. ఈ అవమా నం కేవలం సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డికి మాత్రమే జరుగలేదని యావ త్ తెలంగాణ ఆడబిడ్డలందరినీ రేవంత్‌రెడ్డి అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణ ఆడబిడ్డల ఉసురు రేవంత్‌కు తప్పకుండా తగులుతుందని అన్నారు.
మా మహిళా ఎమ్మెల్యేలు కష్టపడి ప్రజల మధ్యలో తిరిగి గెలిచిన గొప్ప ఆడబిడ్డలని, ప్రజల దీవెనలు, కార్యకర్తల ఆశీర్వాదంతో గెలిచి వచ్చినవాళ్లని అన్నా రు. రేవంత్ రెడ్డి మాదిరిగా పార్టీలు మారి పదవులు తెచ్చుకున్న వాళ్లు కాదని ఎద్దేవాచేశారు. ఇప్పటికైనా సీఎం బుద్ధి తెచ్చుకొ ని బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఏ మొహం పెట్టుకుని వచ్చావని ఉప ముఖ్యమంత్రి అనడం అన్యాయమని అన్నారు. ఆడబిడ్డల గురించి అంత ధైర్యంగా మాట్లాడే అధికారం మీకు ఎవరు ఇచ్చారంటూ భట్టిని ఉద్దేశించి విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉన్నా. ఏ రోజూ తాము ఆడబిడ్డలను అవమానించలేదని చెప్పారు. ఈ రోజు తెలంగాణ ఆడబిడ్డలకు జరిగిన అవమానం దేశం మొత్తం చూసిందని, ముఖ్యమంత్రిగా కొనసాగేందుకు రేవంత్‌రెడ్డి అనర్హుడని కేటీఆర్ ధ్వజమెత్తారు.