- అధికారంలోకి వచ్చి 8 నెలలైనా అమలు కాలే
- రైతుభరోసా, కౌలు రైతుల సాయం అందనే లేదు
- మోసపూరిత హామీలతో అధికారంలోకి కాంగ్రెస్
- రుణమాఫీకాని రైతుల కోసం బీజేపీ టోల్ ఫ్రీ నంబర్
- కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 31(విజయక్రాంతి): తాము అధికారంలోకి వస్తే రైతులు తీసుకున్న రూ.2 లక్షల వరకు రుణాలన్నీ మాఫీ చేస్తామని రైతు డిక్లరేషన్ పేరుతో రైతులకు హామీలు గుప్పించిన కాంగ్రెస్ నేతలు సోనియా, రాహుల్, రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, రుణమాఫీ అమలులో సీఎం రేవంత్ విఫలం చెందారని విమర్శించారు.
డిసెంబరు 9న సోనియమ్మ జన్మదినం సందర్భంగా రైతు రుణమాఫీ చేస్తామని నమ్మించారని, రైతులెవ్వరూ బ్యాంకులకు అప్పులు కట్టొద్దని, ఒకవేళ కడితే మళ్లీ రుణాలు తీసుకోండని రేవంత్‌రెడ్డి రైతులకు వాగ్దానం చేశారని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 8 నెలలు గడుస్తోన్నా ఇంతవరకు రైతు రుణమాఫీని పూర్తిగా ఎందుకు అమలు చేయలే దని ప్రశ్నించారు. రైతు రుణమాఫీ అందని బాధిత రైతుల కోసం బీజేపీ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. రుణమాఫీ కాని రైతులకు అండగా ఉండేందుకు 8886 100 097 నంబర్‌తో హెల్ప్‌లైన్ నంబర్ ప్రారంభించినట్టు తెలిపారు. రుణమాఫీ అందని రైతుల వివరాలు సేకరించి వారికి సాయం అందేలా కార్యాచరణ చేపడతామన్నారు.
రుణ మాఫీపై సర్కారు స్పష్టతనివ్వాలి
ఏ రైతులకు, ఏ ప్రాతిపాదికన రుణాలు మాఫీ చేయబోతున్నారో కాంగ్రెస్ ప్రభు త్వం స్పష్టతనివ్వాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. అనేక గ్రామాల్లో అనేకమంది రైతులకు రుణమాఫీ జరగకపోవడంతో బ్యాంకుల్లో డీఫాల్టర్లుగా మారే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో వాయిదాల పేరుతో కాలయాపన చేస్తోందని ఆరోపించారు. రుణమాఫీ పేరుతో పత్రికల్లో ప్రకటనల కోసం రూ.కోట్ల ప్రభుత్వ ధనాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. గ్రామస్థాయిలో నిర్వహించే రచ్చబండలో రుణ మాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తామని తెలిపారు. రైతు భరోసా, కౌలు రైతులకు సాయం అందనేలేదని ఆరోపించారు. రైతులకు న్యాయం జరిగేలా రాష్ర్ట ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం రైతులకు కిసాన్ సమ్మాన్ నిధులను నిర్ణీత సమయంలో అకౌంట్లలో జమ చేస్తోందని, కానీ, రాష్ర్ట ప్రభుత్వం రుణమాఫీ హామీని ఆ విధంగా నెరవేర్చడం లేదని విమర్శించారు. రైతులు, యువత, బీసీలు, మైనారి టీలు, మహిళలకు.. కాంగ్రెస్ సర్కారు వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు. బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి నిధుల్లో కోతపెట్టి మోసం చేసిందని విరుచుకుపడ్డారు. అనేక రాష్ట్రాల్లో విద్యారంగానికి 14 శాతానికి పైగా బడ్జెట్ కేటాయింపులు జరిపితే... తెలంగాణలో మాత్రం 7.60 శాతం మాత్రమే బడ్జెట్ లో కేటాయింపులు చేశారని ఆవేదన వ్యక్తంచేశారు.