calender_icon.png 5 April, 2025 | 6:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేవంత్ విధ్వంసం కనిపించడం లేదా!

05-04-2025 02:00:50 AM

  1. ప్రధాని మోదీని మీరు వ్యతిరేకిస్తుంటే ఆయన బడేభాయ్ అంటున్నారు
  2. బీజేపీ బుల్డోజర్ రాజ్‌ను వ్యతిరేకిస్తున్న మీకు.. సీఎం రేవంత్ బుల్డోజరిజం గురించి తెలియదా!
  3. సుప్రీం మొట్టికాయ వేసేవరకు హెచ్‌సీయూలో విధ్వంసం ఆపలేదు
  4. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌కు మాజీమంత్రి హరీశ్ రావు బహిరంగ లేఖ

హైదరాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): ‘ప్రధాని మోదీ విధానాలను మీరు వ్యతిరేకిస్తుంటే.. మీ పార్టీకి చెందిన సీఎం రేవంత్‌రెడ్డి ఆయన్ను బడేభయ్ అంటున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్ రాజ్‌ను వ్యతిరేకిస్తున్న మీకు, తెలంగాణలో సీఎం రేవంత్ బుల్డోజరిజం కనిపించడం లేదా?’ అంటూ కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రశ్నించారు.

ఈ మేరకు శుక్రవారం ఆయన రాహుల్‌కు బహిరంగ లేఖ రాశారు. ‘మీరు బోధిస్తున్న నీతి సూత్రాలను సీఎం రేవంత్‌రెడ్డి తుంగలో తొక్కుతున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయిస్తే వెంటనే అనర్హత వేటుపడేలా చట్టం చేస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన మీ మాటలకు విరుద్ధంగా  సీఎం రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులను ప్రొత్సహిస్తున్నారు.

ఇదే విషయమై రేవంత్‌రెడ్డి అసెంబ్లీ లోపల, బయట సుప్రీం కోర్టును సైతం అవమానపరిచేలా కామెంట్లు చేశారు. ఆయన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు సైతం తీవ్రంగా తప్పుబట్టింది. మీరు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతుంటే, రేవంత్ నిత్యం తన అనాలోచిత, అవగాహన రాహిత్యంతో రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు.

హైడ్రా, మూసీ ప్రక్షాళన పేరిట బుల్డోజర్లు పంపి పేద, మధ్య తరగతి ఇండ్లు కూలగొడుతున్నారు. ఈ విధ్వంసపూరిత వైఖరి హైద్రాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరి వందల ఎకరాల్లో విధ్వంసానికి దారితీసింది. జాతీయ పక్షి నెమలి సహా ఇతర పక్షులు, జంతువులు తమ ఆవాసాలు కోల్పోయాయి.

ఈ దుర్మార్గాన్ని వ్యతిరేకిస్తున్న విద్యార్థులు, ప్రొఫెసర్లపై పోలీసుల దాష్టుకం అందరిని కలిచివేసింది. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐతో పాటు కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు ఖండించాయి’ అని హారీశ్‌రావు లేఖలో పేర్కొన్నారు. రోహిత్ వేముల ఆత్మహత్య సమయంలో మీరు హెచ్‌సీయూను సందర్శించగా, అప్పుడు ప్రభుత్వంలో ఉన్న తమ పార్టీ ఎస్కార్ట్ ఇచ్చి పోలీసు భద్రత కల్పించిందని గుర్తు చేశారు.

ఏ కష్టమొచ్చినా అండగా ఉంటామని విద్యార్థులకు ఇచ్చిన హామీని మరిచిపోయారా అని ప్రశ్నించారు. ‘సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చేదాకా కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీలో విద్వాంసకాండను ఆపలేదు. ఈ అంశంపై మీరు మౌనంగా ఉండటాన్ని యావత్ తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

మీరు క్రొనీ క్యాపిటలిజానికి వ్యతిరేకంగా అదానీ వ్యాపార విస్తరణపై దేశవ్యాప్తంగా పోరాటం చేస్తుంటే, తెలంగాణలో మీ సీఎం అదానీకి రెడ్ కార్పెట్ వేసి ఆహ్వానించారు. అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ భూసేకరణ కోసం నల్లగొండ జిల్లాలో రైతులపై పోలీసులు దాడిచేస్తే మీరు మౌనంగా ఉన్నారు.

ఫార్మా విలేజ్ పేరుతో పచ్చని పొలాల్లో చిచ్చురేపి, ఆదివాసీ రైతులను చితగ్గొట్టి బేడీలు వేస్తే మౌనమునిగా మిగిలారు. ఈ అంశాలన్నీ మీకు తెలిసే జరుగుతున్నాయా లేక అన్ని తెలిసి మీరు మౌనంగా ఉంటున్నారా’ అని హరీశ్‌రావు రాహుల్‌గాంధీని ప్రశ్నించారు. ఈ అంశాలపై తెలంగాణ సమాజం మీ నుంచి స్పష్టమైన వివరణ ఆశిస్తున్నదని తెలిపారు.