15-03-2025 12:33:25 AM
హైదరాబాద్, మార్చి 14(విజయక్రాంతి): బీజేపీతో సీఎం రేవంత్‌రెడ్డి చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సీఎం పదవి కాపాడుకునేందుకే ఆ పార్టీ నేతలతో రేవంత్ డీల్ కుదుర్చుకున్నట్లు చెప్పా రు. రేవంత్‌ది సెల్ఫ్ డబ్బా అని, ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లు చేస్తూనే గల్లీలో హోదాను మరిచి తిట్ల దండకం ఎత్తుకుంటున్నారని విమర్శించారు.
బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకుంటున్న “చీప్ మినిస్టర్” రేవంత్‌పై చర్య తీసుకునే దమ్ము కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి ఉందా?- అని ఎక్స్‌లో కేటీఆర్ ప్రశ్నిం చారు. త్వరలో పోయే తన సీఎం పదవిని కాపాడుకోవడానికి బీజేపీ నేతలతో సీఎం రేవంత్‌రెడ్డి రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ ముఖ్యమం త్రిగా ఉంటూ బీజేపీ నేతలతో సీక్రెట్ మీటిం గ్స్ పెట్టుకోవడం దగుల్బాజీ రాజకీయమని మండిపడ్డారు. ఇలాంటి చిల్లర రాజకీయాన్ని తెలంగాణగడ్డపై ఎప్పుడూ చూడలేదన్నారు. ఏదో గూడుపుఠాణి చేసి తెలంగాణను ఆగం చేయడానికే ఈ తెరచాటు సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో దొరికిపోయిన రేవంత్‌రెడ్డిపై చర్య తీసుకునే ధైర్యం అసలు రాహుల్‌గాంధీకి ఉందా అన్నారు. ఓవైపు బీజేపీ నేతలతో కుస్తీపడుతున్నట్టు బయట ఫోజులు కొడుతూ, దొంగచాటుగా వాళ్లతో దోస్తీ చేయడమే కాంగ్రెస్ సంస్కృతా అని ప్రశ్నించారు.
ఒకవైపు పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, గురుకులాల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా ఒక్క సమీక్ష సమావేశం నిర్వహించే సమయంలేని సీఎంకు, ఈ రహస్య సమావేశాలకు మాత్రం టైమ్ దొరకడం క్షమించలేని ద్రోహం అని కేటీఆర్ మండిపడ్డారు.
మాటలు కోటలు..
గల్లీలో హోదాను మరిచి తిట్లు.. ఢిల్లీలో మాత్రం మీడియాతో చిట్‌చాట్‌లు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. కాలు గడప దాటదు కానీ..ఢిల్లీలో మాటలు కోటలు దాటుతున్నాయని ఎద్దేవా చేశారు. నీళ్లులేక పంటలు ఎండి- పొలాలు బీడువారి అన్నదాతలు అరిగోస పడుతుంటే..కనీసం సాగునీళ్ల పై సమీక్ష లేకుండా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నారని మండిపడ్డారు.
“39సార్లు ఢిల్లీకి పోయి మీడియా ముందు సెల్ఫ్ డబ్బా కొట్టుకునుడు తప్ప..ఢిల్లీ నుంచి సాధించిన పని..తెచ్చిన రూపాయి లేదు..రాహుల్‌గాంధీతో నీ సంబంధాల గురించి తెలంగాణకు ఏం అవసరం.. మీ మధ్య సంబంధం ఉంటే మాకేంటి-..ఊడితే మాకేంటి.. తెలంగాణకు ఒరిగేది ఏంటి” అని ప్రశ్నించారు.
ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిని శాసనసభ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం సస్పెండ్ చేయడంపై రాష్ర్ట వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. జగదీశ్ రెడ్డి సస్పెన్షన్ అప్రజాస్వామికం అన్నారు.
ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తున్న బీఆర్‌ఎస్ గొంతు నొక్కేందుకే సీఎం రేవంత్‌రెడ్డి సస్సెన్షన్లను ఆయుధంగా మలుచుకున్నారని మండిపడ్డారు. పార్టీ పిలుపు మేరకు గ్రామగ్రామాన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి, ప్రభుత్వాన్ని ఎండగట్టిన కార్యకర్తలు, నాయకులకు కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.