calender_icon.png 11 October, 2024 | 5:56 AM

కేసీఆర్‌ను విమర్శించకుండా రేవంత్ మాట్లాడలేరు

11-10-2024 01:17:07 AM

మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  

హైదరాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి): పది నెలల్లో కేసీఆర్ పేరు ఎత్త కుండా సీఎం రేవంత్‌రెడ్డి ఏ ఒక్క సభలో కూడా మాట్లాడలేదని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విమర్శించారు. గురువారం ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ సీఎం హోదాలో మాట్లాడేటప్పుడు ప్రభుత్వ కార్యక్రమా, పార్టీ కార్యక్రమమనే సంగతి మరిచిపోయి ఇష్టనుసారంగా విమర్శలు చేస్తున్నారని మండిప డ్డారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చామని చెబుతున్న టీచర్ పోస్టులు కేసీఆర్ మంజూరు చేసిన సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన 25వేల టీచర్ పోస్టులు ఎందుకు ఇవ్వలేదో ఆ గురువుల ముందు చెప్తే బాగుండేదన్నారు. ఎన్నికలప్పుడు 6వేల పాఠశాలలు మూత పడ్డాయని అబద్దం చెప్పిన రేవంత్‌రెడ్డి ఆ పాఠశాలల లిస్ట్ విడుదల చేస్తే ఉపాధ్యాయులకు అర్థమయ్యే దన్నారు.

మన ఊరు మన బడి కార్యక్రమం ఎందుకు నిలిపివేశారో చెబితే ఆయన పరువు పోయేందని ఎద్దేవా చేశారు. 6 లక్షల మంది పేద విద్యార్థులు చదువుతున్న గురుకులాలను ప్రభుత్వం నిర్వీర్యం చేసే విషయాలు ఎందుకు చెప్పలేదని నిలదీశారు.

బ్రేక్ ఫాస్ట్ స్కీమ్, ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఎప్పుడు ఇస్తారో చెప్తే బాగుండేదన్నారు. 19 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం మిగితా పాఠశాలలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.