వెలిచాల రాజేందర్‌రావు :
ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజా ప్రభుత్వం నూటికి నూరు శాతం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
వ్యవసాయానికి, రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యమిస్తున్నది. రైతును రాజు చేయడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం దేశ చరిత్రలోనే రూ.31 వేల కోట్లు రుణమాఫీకి కేటాయించడం రికార్డు. ఏ రాష్ట్రం కూడా ఇంత వరకు ఇన్ని వేల కోట్లు కేటాయించలేదు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. 2022 మే 6న వరంగల్ రైతు డిక్లరేషన్‌లో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రాహుల్‌గాంధీ ప్రకటించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఓట్లు వేసి కాంగ్రెస్‌ను గెలిపించినందుకు కృతజ్ఞతగా రైతు రుణాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీరుస్తున్నారు.
రాష్ట్ర పరిస్థితి ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో రెండో విడత రుణమాఫీ కార్యక్రమానికి 30వ తేదీన ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. 12 రోజుల్లో రూ.12 వేల కోట్ల రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. లక్షన్నరలోపు ఉన్న ఆరు లక్షల 40 వేల మందిని సర్కార్ రుణ విముక్తులను చేసింది. ఇందుకోసం రూ.6,190 కోట్లను ఆరు లక్షల 40 వేల మంది రైతుల ఖాతాల్లో జమ చేసింది.
ఈనెల 18న మొదటి విడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షవరకు పంట రుణాలు ఉన్న 11 లక్షల 34,412 మంది రైతుల బ్యాంక్ ఖాతాల్లో రూ.6,034.96 కోట్లను జమ చేసి రుణమాఫీ చేపట్టింది. ఇలా ఇప్పటి వరకు రెండు విడతల్లో కలిపి 17,75,235 మంది రైతుల క్రాప్ లోను ఖాతాల్లో రూ.12,224.98 కోట్లు జమ చేసింది. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రం కూడా ఒకేసారి ఇంత పెద్ద మొత్తంలో రైతు రుణమాఫీ చేసిన దాఖలాలు లేవు. ఏ రాష్ట్రంలోనూ రూ. 31 వేల కోట్లు కేటాయించలేదు. రైతు రుణమాఫీ దేశ చరిత్రలోనే కొత్త రికార్డు సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్త అధ్యాయానికి నాంది పలికింది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉన్నా పట్టు వదలని విక్రమార్కుడిలా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు సమిష్టిగా కృషి చేసి రుణమాఫీ చేస్తున్నారు. ఆగస్టు 15లోపు రెండు లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని పూర్తి చేయనున్నారు. పాత రుణాలను మాఫీ చేయడం, మళ్లీ పంటల సాగుకోసం రైతులకు కొత్త రుణాలు అందించేందుకు కృషి చేస్తున్నారు. రెండు విధాల రైతులకు ప్రయోజనం కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం. దీంతోపాటు రైతులు కష్టపడి పండిస్తున్న పంటలకు బీమా కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించనుంది. పంటలకు నష్టం జరిగితే బీమా కంపెనీ నుంచి పరిహారం చెల్లిస్తుంది. పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ పంటల బీమాను కూడా అమలు చేయలేకపోయింది. ఇది వారి అసమర్థతకు నిలువుటద్దంగా నిలుస్తుంది.
పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ నాయకులు తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. పదేళ్ల కాలంలో రూ. ఏడు లక్షల కోట్ల అప్పులు చేసింది బీఆర్‌ఎస్. దీనికి పర్యవసానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎనిమిది నెలల్లోనే రూ.43 వేల కోట్లు వడ్డీలకు చెల్లించింది. రాష్ట్రంలో వస్తున్న ఆదాయంలో అధికంగా వడ్డీలు చెల్లించడానికే సరిపోతున్నది.
ఎనిమిది నెలల్లోనే రూ.31 వేల కోట్లు
రెండవసారి రుణమాఫీ హామీతో అధికారంలోకి వచ్చిన బీఆర్‌ఎస్ రూ.19 వేల కోట్లు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి రూ.12 వేల కోట్లు మాత్రమే విడుదల చేసింది. రూ.7,000 కోట్ల రుణాలు మాఫీ చేయలేదు. పదేళ్ల కాలంలో లక్షవరకు అదికూడా నాలుగైదు విడతలుగా కేవలం రూ.25 వేల కోట్లు రుణమాఫీ సరిగా చేయలేకపోయింది. బీఆర్‌ఎస్ రైతులను మోసగించింది. దీంతో ప్రజలు బీఆర్‌ఎస్‌కు కర్రు కాల్చి వాత పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రూ.31 వేలతో రుణమాఫీ చేయడం రైతులపట్ల ఉన్న ప్రేమకు నిదర్శనం. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రంలో రుణమాఫీ ఎలా చేస్తారని కొందరు కాంగ్రెస్‌ను అవహేళన చేశారు, శాపనార్థాలు పెట్టారు.
కానీ, సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ పూర్తి చేసేందుకు నిధులు సమకూర్చింది. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ చిత్తశుద్ధికి తార్కాణం. గతంలో పాలించిన బీఆర్‌ఎస్ అప్పులు చేసి తెలంగాణను తాకట్టు పెట్టింది. తాకట్టు నుంచి తెలంగాణను విడిపించి రుణాల భారం తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం ఎల్లవేళలా కృషి చేస్తున్నది. ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్‌దారులకు జీతాలు చెల్లిస్తున్నది. వృద్ధులకు, ఒంటరి మహిళలకు, దివ్యాంగులకు ప్రతి నెల పింఛన్ల పంపిణీ, ఆర్టీసీ బస్సుల్లో మహాలక్ష్మి పథకం కింద మహిళల ఉచిత ప్రయాణ సౌకర్యం, రూ.10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, గ్యాస్ సబ్సిడీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతోపాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం కొనసాగిస్తున్నది. ఇది కాంగ్రెస్ చిత్తశుద్ధికి నిదర్శనం. ఇదంతా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రజా ప్రభుత్వం నూటికి నూరు శాతం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
వ్యాసకర్త కాంగ్రెస్ పార్టీ
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి