calender_icon.png 2 October, 2024 | 3:52 PM

రేవంత్ తెలంగాణ తుగ్లక్

02-10-2024 02:57:22 AM

నీ గడువు ముగిసింది.. ఇంటికి వెళ్లే  సమయం ఆసన్న మైంది

బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అభయ్ పాటిల్  

దీక్ష ముగిసినా పోరాటం కొనసాగుతుందని స్పష్టం 

కాంగ్రెస్ పార్టీపై నిప్పులులు చెరిగిన బీజేపీ నేతలు

హైదరాబాద్, అక్టోబర్ 1 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గడువు ముగిసిందని, ఆయన ఇంటికి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ రాష్ర్ట వ్యవహారాల ఇన్‌చార్జి అభయ్ పాటిల్ అన్నారు. రేవంత్‌రెడ్డి తెలంగాణ తుగ్లక్ అని తీవ్ర స్థాయిలో విమర్శ చేశారు.

తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు, హామీలు అమలు చేయలేదని విమర్శించారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ధ బీజేపీ ప్రజాప్రతినిధులు చేపట్టిన 24 గంటల రైతు హామీల సాధన దీక్షకు హాజరైన పాటిల్.. నిమ్మరసం ఇచ్చి పార్టీ ప్రజాపత్రినిధుల దీక్షను విరమింపజేశారు.  

పోరాటం కొనసాగుతోంది 

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు రైతాంగానికి ఇచ్చిన ముఖ్య హామీలైన రైతు రుణమాఫీ, రైతుబీమా, రైతు భరోసా, కౌలు రైతులు, కూలీలు, వరి ధాన్యానికి రూ.500 బోనస్ అంశాలపై సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన దీక్షను మంగళవారం ఉదయం 11 గంటలకు ముగిసింది.

హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్ పార్టీపై నేతలు నిప్పులు చెరిగారు. 24 గంటల నిరసన దీక్ష ముగిసిందని, ప్రభుత్వ వైఫల్యంపై పోరాటం కొనసాగుతూనే ఉంటుందని అభయ్ పాటిల్ స్పష్టంచేశారు. పోరాటానికి సమస్యలను వెతకాల్సిన అవసరం లేదని, అధికార పార్టీ వాళ్లే అనేక సమస్యలు సృష్టించి తమకు ఇస్తున్నారని ఆయన అన్నారు. 

సీఎం రేవంత్ రెడ్డి గజనీ: ఏలేటి 

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గజనీలా మారిపోయారని, తాను ఇచ్చిన హామీలను మర్చిపోతున్నారని బీజేఎల్పీ నేత ఎలేటి మహేశ్వర్‌రెడ్డి విరుచుకుపడ్డారు. ఇచ్చిన హామీలు, గ్యారెంటీలు పక్కన పెట్టి హైదరాబాద్, -ఢిల్లీ మధ్య చక్కర్లు కొడుతున్నారని అన్నారు. రుణమాఫీకి నిధులు లేవంటున్న సర్కారు.. మూసీ నది ప్రక్షాళన కోసం లక్ష కోట్లను ఎక్కడినుంచి తెస్తుందని ప్రశ్నించారు. రైతులు, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

కేసీఆర్ దుర్మార్గపు పాలననే రేవంత్ కొనసాగిస్తున్నారు: ఎంపీ అర్వింద్

కేసీఆర్ చేసిన దౌర్భాగ్యపు పాలననే రేవంత్‌రెడ్డి కొనసాగిస్తున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. ఇచ్చిన హామీలు, చేసిన వాగ్దానాలు మోసంలాగే మిగిలిపోయాయ న్నారు. పేదల ఇండ్లను కూల్చివేసి ధనవంతులకు నోటీసులిస్తున్నారని అన్నా రు. ఎఫ్టీఎల్ లో పర్మిషన్లు ఇచ్చిన అధికారుల మీద చర్యలు తీసుకున్నారా? కేవలం జేబులు నింపుకోవడం కోసమే హైడ్రాను వాడుకుంటున్నారా? అని ప్రశ్నించారు

సీఎం రేవంత్ చిలక పలుకులు: ఈటల

సీఎం రేవంత్ హామీల అమలు విషయంలో చిలక పలుకులు పలుకుతున్నారని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. అవి ఆయన గౌరవాన్ని తగ్గిస్తాయే తప్ప పెంచవని చెప్పారు. రైతులని నమ్మించి మోసం చేస్తే.. ప్రజాక్షేత్రంలో వారే నిన్ను బొందపెడతారని హెచ్చరించారు. హైడ్రాపై కోర్టు వ్యాఖ్యలను రేవంత్‌రెడ్డి గుర్తుంచుకోవాలన్నారు. ప్రజల మీద ప్రేమ, చట్టం మీద నమ్మకం ఉంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.