calender_icon.png 16 October, 2024 | 5:55 PM

పత్తి రైతులతో రేవంత్ సర్కార్ చెలగాటం

16-10-2024 02:42:04 AM

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): పత్తి రైతులతో ప్రభుత్వం చెలగాటమాడుతుందని.. బడాభాయ్ రాష్ట్రంలో పత్తి రైతుకు పట్టాభిషేకం, చోటాభాయ్ పాలనలో పత్తి రైతు బతుకు చిత్తుగా మారిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన ఎక్స్‌వేదికగా స్పందిస్తూ గుజరాత్‌లో మద్దతు ధరకు మించి రైతులకు క్వింటా పత్తికి రూ.8,257 అందుతుండగా.. అందుకు భిన్నంగా తెలంగాణ లో పత్తి రైతుకు కేవలం రూ.5 వేలే దక్కుతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

మార్కెట్‌కు దిగుబడి వచ్చినా సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేయలేదని, ఇందిరమ్మ రాజ్యమని చెప్పి దళారుల రాజ్యం తెచ్చారని విమర్శించారు. రెండేండ్ల కింద పత్తికి రూ.10 వేలకు పైగా ధర లభించిందన్నారు. ఇప్పటివరకు పెట్టుబడి సాయం పత్తా లేదన్నారు.

మరో విషయమై స్పంది స్తూ ఢిల్లీకి మూటలు పంపేందుకు ప్రభుత్వం వద్ద పైసలుంటాయని కానీ పేద విద్యార్థులు చదువులు చదివే గురుకులాల అద్దెలు చెల్లించడానికి పైసలు లేవంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడవక ముందే కరెంట్ చార్జీలు పెంచి జనం మీద భారం మోపడానికి ప్ర యత్నాలు చేస్తుందని మండిపడ్డారు. జీరో బిల్లులు కోసం ప్రజలు ఎదురుచూస్తుంటే.. కొత్త బాదుడుకు తెర లేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు.