calender_icon.png 2 October, 2024 | 8:01 AM

ఆ భూమిని తిరిగి ఇచ్చేస్తున్నా

02-10-2024 01:55:27 AM

పరిహారంగా ఇచ్చిన 14 ప్లాట్లను ముడాకే అప్పజెప్తున్నా 

నా భర్త గౌరవం, ఘనత కన్నా ఆస్తులు ముఖ్యం కాదు

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య భార్య సంచలన ప్రకటన

రాజకీయ కుట్రలకు నా భార్య బలైంది: సిద్ధు

బెంగళూరు, అక్టోబర్ 1: ముడా స్కాం ఆరోపణలతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ ఆయన సతీమణి పార్వతమ్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ వ్యవహారంలో భూముల కేటా యింపుపై లోకాయుక్తతో పాటు ఈడీ కేసు నమోదు చేయగా.. ఆ భూములను తిరిగి ముడాకు అప్పగిస్తామని ప్రకటన చేశారు.

అవినీతి మరక లేని తన భర్త రాజకీయ జీవితానికి ముప్పు తెస్తున్న మైసూరు సమీపం లోని విజయనగర ప్రాంతంలో ఉన్న 14 స్థలాలను తిరిగి అప్పజెప్తామని ముడాకు తెలుపుతూ లేఖ రాశారు. సేల్ డీడ్ రద్దు చేసి ఆ 14 ప్లాట్లను తిరిగి ఇచ్చేస్తాను. ముడా ఈ సైటను స్వాధీనం చేసుకోవాలని కోరుకుంటున్నా.

మా అన్నయ్య పసుపుకుంకుమల కింద ఇచ్చిన 3.16 ఎకరాల భూమిపై ఇంత రాద్దాంతం జరుగుతుందని ఊహించలేదు. నా భర్త గౌరవానికి మించిన ఆస్తులు నాకు అవసరం లేదు. ఆయన అధికారం నుంచి ఇన్నేళ్లు ఏమీ ఆశించలేదు. ఇది నేను సొంతం గా తీసుకున్న నిర్ణయం.

ఎలాంటి దర్యాప్తుకైనా నేను సహకరిస్తా. రాజకీయాలకు దూరంగా ఉండే నాలాంటి ఆడవాళ్లను వివాదాల్లోకి లాగొద్దు లేఖలో పార్వతమ్మ పేర్కొన్నారు. భూములను తిరిగి అప్పజెప్తే తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని, పార్వతమ్మ ప్రకటనను అంగీకరిస్తున్నట్లు ముడా తెలిపింది. 

నేరం అంగీకరిస్తున్నారా?: బీజేపీ

ఈ వ్యవహారంలో నేరం అంగీకరించి సాత్వికంగా లొంగిపోయినట్లు ఉందని బీజేపీ నేత బసవగౌడపాటిల్ ఆరోపించారు. స్థలాలను ఇప్పుడు అప్పగిస్తామంటున్నారని, ఫిర్యాదులు వచ్చాకనే ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. సిద్ధరామయ్యకు ఈ విషయం బాగా తెలుసు.

భూసేకరణకు పరిహార చెల్లింపు న్యాయబద్ధంగా లేదని ఇప్పుడు బహిరంగంగా అంగీకరిస్తున్నారు. ముడా కేసు ఇప్పుడు బహిర్గతమైంది. ఇందులో బంధుప్రీతి, అవినీతి ఉందని స్పష్టంగా తెలుస్తోంది అని పాటిల్ అన్నారు. బీజేపీ కర్ణాటక చీప్ విజయేంద్ర కూడా సిద్ధరామయ్యపై విమర్శలు గుప్పించారు. 

అసలేంటి వివాదం

2010లో పార్వతమ్మకు ఆమె సోదరుడు మల్లికార్జునస్వామి 3.16 ఎకరాల భూమిని ఇచ్చారు. 2011-13 మధ్య ఈ భూమిని ముడా స్వాధీనం చేసుకుంది. దీనిపై 2014లో పార్వతమ్మ పరిహారం కోరగా 2017లో అందుకు ముడా అంగీకరించింది. 2022లో ఆమెకు 14 ప్లాట్లు కేటాయించింది. ముడా 50:50 పథకం కింద కేటాయించిన ప్లాట్లు అసలు భూమి కంటే చాలా విలువైనవని ఫిర్యాదులు వచ్చాయి.

ఈ వివాదం పెరగడంతో తన భార్యకు రూ.62 కోట్లు పరిహారంగా చెల్లిస్తే ఆ 14 ప్లాట్లను తిరిగి ఇస్తానని సిద్ధరామయ్య ప్రతిపాదించారు. సీఎం భార్య కాబట్టే విలువైన భూములను అప్పగించారని బీజేపీ సహా పలువురు ఆర్టీఐ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. కోర్టు ఆదేశాలతో తొలుత లోకాయుక్త ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. 

విద్వేష రాజకీయాలకు బాధితురాలు: సిద్ధూ

పార్వతమ్మ నిర్ణయంపై సీఎం సిద్ధరామయ్య స్పందిస్తూ.. ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోయానని చెప్పారు. విద్వేష రాజకీయాలు, కుట్రలకు తన భార్య బాధితురాలు అయ్యారని, ఏదేమైనా ఆమె నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు పోస్ట్ చేశారు. భూసేకరణ చేపట్టకుండా ముడా సేకరించిన భూమికి పరిహారంగా ఇచ్చిన ప్లాట్లను నా భార్య పార్వతి తిరిగి ఇచ్చేశారు.

విద్వేష రాజకీయాలతో అసత్య ఆరోపణలు చేసి నా కుటుంబాన్ని వివాదంలోకి లాగారని రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. అన్యాయమైన రాజకీయాలకు తలొగ్గకుండా పోరాడటమే నేను దృఢ నిశ్చయంగా పెట్టుకున్నా. 40 ఏళ్లుగా ఎప్పుడూ రాజకీయాల్లో జోక్యం చేసుకోని నా భార్య విద్వేష రాజకీయాలకు బలైపోయి మానసిక వేదన అనుభవించారు. నేను కూడా కొంత ఆవేదనకు గురయ్యాను. ఈ విషయంలో నా భార్య నిర్ణయాన్ని గౌరవిస్తున్నా అని చెప్పారు.